భారతదేశంలో వ్యాపారవేత్తలు, ముఖ్యంగా నిజాయితీగా పన్నులు చెల్లించేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరోసారి చర్చ మొదలైంది. దేశంలోని పన్ను నిబంధనలు పన్ను చెల్లింపుదారులపై అనుమానం పెంచేలా ఉన్నాయని, దీనివల్ల వ్యాపారం చేయడం భారంగా మారుతోందని బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త, అఫ్లాగ్ గ్రూప్ భాగస్వామి రోహిత్ ష్రాఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. 2026 నాటికి తాను భారతదేశాన్ని విడిచిపెట్టి, విదేశాల్లో తన వ్యాపారాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
రూ.4 కోట్ల పన్ను చెల్లించినా దక్కని గుర్తింపు
రోహిత్ ష్రాఫ్ తన పోస్ట్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం.. దేశానికి అత్యధికంగా సహకరించే పన్ను చెల్లింపుదారులను వ్యవస్థ డిఫాల్ట్‌గా అనుమానంతో చూస్తోందని ఆయన మండిపడ్డారు. తాను జీఎస్టీ, ఆదాయపు పన్ను రూపంలో సుమారు రూ.4 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. ‘దేశంలో కేవలం 4-5% మందే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. నోటీసులు పంపాలన్నా, పరిశీలన (Scrutiny) చేయాలన్నా అధికారులు కొద్ది మందినే లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని ఆయన ఆరోపించారు. జీఎస్టీ బృందాలు, ఆదాయపు పన్ను అధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగుతుంటాయని, పన్ను నిబంధనలు పాటించే వ్యాపారాలకు ఎటువంటి గుర్తింపు లేదా ప్రోత్సాహకాలు లభించడం లేదని ఆయన విమర్శించారు.
భారతీయులు విదేశాలకు వెళ్లడంపై స్పందిస్తూ, ‘ఇండియన్స్‌కు సామర్థ్యం తక్కువ కాదు. యూఏఈ, యూఎస్ వంటి దేశాల్లో వారు పెద్ద వ్యాపారాలను నడుపుతున్నారు. వారు దేశాన్ని ద్వేషించి వెళ్లడం లేదు, కానీ ఇక్కడి వ్యవస్థ వృద్ధికి ప్రతిఫలాన్ని ఇవ్వదు. పైగా జరిమానా విధిస్తుంది. ఒక దశలో నినాదాల కంటే స్వీయ సంరక్షణ ముఖ్యం. ఇది దేశభక్తికి సంబంధించిన విషయం కాదు, వాస్తవికత. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార సులభతర నిర్వహణ) లోపించింది. అందుకే 2026లో ఇండియా వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని ష్రాఫ్ వ్యాఖ్యానించారు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
రోహిత్ ష్రాఫ్ పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘సిస్టమ్ మిమ్మల్ని ప్రోత్సహించడం కంటే ప్రాసిక్యూట్ చేయడానికే ఎక్కువ ప్రయత్నిస్తుంది’ అని ఒక వినియోగదారుడు తెలిపారు. ‘నేను 9 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను, పక్కాగా నిబంధనలు పాటిస్తే ఒక్క నోటీసు కూడా రాదు. మీ వ్యక్తిగత నిర్ణయానికి దేశాన్ని నిందించకండి’ అని కొందరు ష్రాఫ్ వాదనను కొట్టిపారేశారు.
ఇదీ చదవండి: 2025.. ఏఐ ఇయర్


