భారతదేశంలోని జెన్ జీ (Gen Z) నవ యువతలో సంగీతం ప్రాధాన్యత పెరుగుతోంది. ట్రావెల్ టెక్ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) విడుదల చేసిన తాజా అధ్యయనం పలు ఆసక్తి వివరాలు తెలియజేస్తోంది. సంగీత కచేరీలు, మ్యూజిక్ ఫెస్టివల్స్ యువయాత్రలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రేరేపిస్తున్నాయి.
ఎయిర్‌బీఎన్‌బీ ‘ఎక్స్‌పీరియన్స్-లెడ్ ట్రావెల్ ఇన్‌సైట్స్’ రిపోర్ట్ ప్రకారం, 2026లో 62% యువ భారతీయులు కచేరీలు, సంగీత ఫెస్టివల్స్ కోసం ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారు. ఇది సంప్రదాయ విహారం కోసం చేసే యాత్రల నుండి సాంస్కృతిక అనుభవాల ఆధారిత యాత్రల వైపు మార్పును సూచిస్తుంది. ఇప్పటికే 76% మంది జెన్ జీ ప్రతినిధులు.. సంగీత కార్యక్రమం కోసమే తాము ఓ కొత్త నగరాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు.
ఈవెంట్ ముగిసినా..
ఇలా మ్యూజిక్ ఈవెంట్ల కోసం వెళ్లినవారు ఆ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఈవెంట్ అయిపోయాక కూడా అక్కడే ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలను మరింతగా అన్వేషిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 53% మంది ఇలాగే స్థానిక ప్రాంతాలు, కాఫీ షాపులు, నైట్‌లైఫ్, సాంస్కృతిక హాట్‌స్పాట్లను చూడటం కోసం తమ వసతిని మరికొన్ని రోజులు కొనసాగించారు.
విదేశాలకూ వెళ్తాం..
ఈ సంగీత ఆధారిత యాత్రలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. 40% కి పైగా జెన్ జీ ప్రతినిధులు అంతర్జాతీయంగా జరిగే మ్యూజిక్ ఈవెంట్ల కోసం ముఖ్యంగా అమెరికా, యూరోప్, ఆసియా దేశాలకు కూడా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 70% మంది ఫ్రెండ్స్ తో సమూహంలో ఈ ఈవెంట్లలో పాల్గొనడాన్ని ఇష్టపడుతున్నారు. గ్రూప్ స్టేలకు డిమాండ్‌ను పెంచుతోంది.
ఖర్చు లెక్కేం లేదు..
ఇలా మ్యూజిక్ ట్రిప్‌లకు వెళ్లడం కోసం ఖర్చుకు కూడా వెనకాడటం లేదు భారత జెన్‌జీ యువత. ప్రతి పది మందిలో ఆరుగురు యువ యాత్రికులు తమ నెలవారీ ఆదాయంలో 21–40% మ్యూజిక్ కన్సర్ట్ -ఆధారిత ట్రిప్‌లపైనే ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కో సంగీత కార్యక్రమ ప్రయాణానికి చేసే సగటు ఖర్చు రూ.51 వేల దాకా ఉంటోంది.
ఇదీ చదవండి: ఇవేం ధరలు బాబోయ్.. హ్యాట్రిక్ కొట్టేసిన పసిడి, వెండి


