డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్ మూడోసారి ఆఫర్ చేసిన మార్పిడికివీలుకాని లిస్టెడ్ డిబెంచర్ల(ఎన్‌సీడీలు)కు భారీ డిమాండ్ నెలకొంది. ఆఫర్ ప్రారంభమైన 45 నిముషాల్లోనే బాండ్లు విక్రయమైనట్లు స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) డేటా వెల్లడించింది. నిజానికి తొలుత రూ. 500 కోట్ల విలువైన ఎన్‌సీడీలను ఆఫర్ చేయగా.. 10 నిముషాలలోనే అంతకుమించిన సబ్‌స్క్రిప్షన్ లభించింది.
వార్షికంగా 8.9 శాతం ఈల్డ్(వడ్డీ ఆర్జన)తో వీటిని ఆఫర్ చేసింది. అయితే భారీ డిమాండ్ నేపథ్యంలో గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా మరో రూ. 500 కోట్ల విలువైన ఎన్‌సీడీలను సైతం విక్రయించింది. వెరసి 45 నిముషాల్లోనే రూ. 1,000 కోట్లు సమీకరించింది. ఇష్యూ పరిమాణం 50 లక్షలుకాగా.. 2.19 కోట్ల ఎన్‌సీడీలకు బిడ్స్ దాఖలయ్యాయి. ఇవి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. 6న ఓపెన్ అయిన ఇష్యూ 19న ముగియనుంది. వీటిని తొలుత వచ్చినవారికి తొలుత ప్రాతిపదికన జారీ చేయనున్న సంగతి తెలిసిందే.
75 శాతం చెల్లింపులకే
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆఫర్ చేసిన ఎన్‌సీడీలకు రేటింగ్ దిగ్గజాలు ఇక్రా, క్రిసిల్ వీటికి స్థిరత్వ ఔట్‌లుక్‌తో కూడిన ఏఏమైనస్ రేటింగ్‌ను ప్రకటించాయి. నిధులలో 75 శాతాన్ని ప్రస్తుత రుణాల చెల్లింపునకు అదానీ గ్రూప్ దిగ్గజం వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ఇంతక్రితం 2025 జూలైలో ఎన్‌సీడీల జారీ ద్వారా రెండోసారి రూ. 1,000 కోట్లు సమీకరించింది.
తాజాగా విక్రయించిన ఎన్‌సీడీలను 24, 36, 60 నెలల కాలావధితో ఆఫర్ చేసింది. వీటికి త్రైమాసిక, వార్షిక పద్ధతిలో వడ్డీని చెల్లించనుంది. గత నెలలో ప్రారంభమైన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌సహా.. కంపెనీ వైజాగ్‌లో గూగూల్ అదానీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్, దేశవ్యాప్తంగా వివిధ రహదారుల ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్న విషయం విదితమే.


