షేరుకి రూ. 1,800 ధరలో షురూ ∙రూ. 24,930 కోట్ల సమీకరణకు రెడీ
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్ రైట్స్ ఇష్యూ ప్రారంభమైంది. షేరుకి రూ. 1,800 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 24,930 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా 13.85 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. తద్వారా దేశీయంగా అతిపెద్ద రైట్స్ ఇష్యూలలో ఒకటిగా నిలవనుంది. రైట్స్‌కు అనుమతించిన ధరతో పోలిస్తే 24 శాతం డిస్కౌంట్‌లో వీటిని జారీ చేయనుంది. డిసెంబర్ 10న ఇష్యూ ముగియనుంది.
రైట్స్‌లో భాగంగా వాటాదారులవద్దగల ప్రతీ 25 షేర్లకుగాను 3 షేర్లు ఆఫర్ చేస్తోంది. ప్రమోటర్లుసహా వాటాదారులందరికీ ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లవాటా 74 శాతంకాగా.. వాటాదారులు తొలుత ఒక్కో షేరుకి రైట్స్ ధరలో 50 శాతం(రూ. 900) చొప్పున చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన రూ. 900 తదుపరి రెండు దశలలో చెల్లించవలసి ఉంటుంది. రైట్స్ ప్రారంభం నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు బీఎస్‌ఈలో 2.7 శాతం క్షీణించి రూ. 2,334 వద్ద ముగిసింది.


