1,800 టన్నులకు వెండి హోల్డింగ్స్
గత 18 నెలల్లో భారీగా కొనుగోలు
2024 ముగింపుకంటే 51% అప్
వెండి కొనుగోళ్లకు టాప్–2లో భారత్
బంగారం వినియోగంలో చైనాతో పోటాపోటీ
’’అలుపెరుగకుండా పరుగుతీస్తున్న బంగారం బాటలోనే వెండిలో కూడా పెట్టుబడులు చేపట్టేందుకు మూడేళ్ల క్రితం దేశీయంగా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ప్రొడక్టు (ఈటీపీ)లకు తెరతీశారు. వీటిలో ఈటీఎఫ్‌లు ప్రధాన భాగం. దీంతో 2022లో వెండి ఈటీఎఫ్‌లు ఊపిరిపోసుకున్నాయి. తొలి దశలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంగా ఇవి జోరందుకున్నాయి. దీంతో 2007లోనే ప్రారంభమైన పసిడి ఈటీఎఫ్‌లను వెనక్కి నెడుతూ వెండి ఈటీఎఫ్‌లు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్
ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహా లు బంగారం, వెండిలో పెట్టుబడులకు వీలుగా రూపొందించిన ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)కు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ దేశాలలో బంగారం వినియోగంలో భారత్, చైనాలు టాప్ ర్యాంకులో నిలుస్తుంటే.. వస్తురూపేణా (ఫిజికల్) వెండి కొనుగోళ్లకు సైతం భారత్ రెండో ర్యాంకులో నిలుస్తోంది. దేశీయంగా ఇటీవల ఈటీఎఫ్‌ల ప్రవేశంతో ప్రధానంగా వెండిలో పెట్టుబడులు అధికమయ్యాయి.
పసిడి ధరల ర్యాలీతో పోలిస్తే కొద్ది నెలలుగా వెండి వెనుకబాటు దీనికి కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల కొద్ది నెలలుగా సౌర విద్యుదుత్పత్తితోపాటు.. ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ, వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ వెండి ధరలకు జోష్‌నివ్వనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశాయి. ఫలితంగా ఇటీవల వెండిలో ఫిజికల్ కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు వివరించాయి.
200 శాతం జూమ్
2022తో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 200 శాతం దూసుకెళ్లాయి. న్యూయార్క్ సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ వివరాల ప్రకారం ఈ కాలంలో దేశీ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 18 రెట్లు ఎగశాయి. ఈ బాటలో గత 18 నెలల్లో పెట్టుబడులు భారీగా జంప్‌చేశాయి. తాజాగా వెండి హోల్డింగ్స్ 5.8 కోట్ల ఔ న్స్‌లు (1,800 టన్నులు)ను దాటాయి. 2024 చివరితో పోలిస్తే ఇది 51 శాతం అధికం!
పెట్టుబడుల దూకుడు
మూడేళ్ల క్రితం(2022 తొలి త్రైమాసికం) వెండి ఈటీఎఫ్‌లు ప్రవేశపెట్టినప్పుడు హోల్డింగ్స్ 2.1 మిలియన్ ఔన్స్‌లు (65 టన్నులు) మాత్రమే. తదుపరి పెట్టుబడులు ఊపందుకోవడంతో 2024 చివరి క్వార్టర్‌కల్లా 3.8 కోట్ల ఔన్స్‌ల (1,183 టన్నులు)కు చేరాయి. ఇది వార్షికంగా 200 శాతం వృద్ధికాగా.. ఒక్క 2024లోనే 2.51 కోట్ల ఔన్స్‌ల (782 టన్నులు) పెట్టుబడులు జత కలిశాయి. ఆపై వెండి ఈటీఎఫ్‌లు మరింత జోరందుకున్నాయి.
పసిడి వెనుకడుగు
వెండి ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఇన్వెస్టర్లు పసిడి ఈటీఎఫ్‌లలో పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు బంగారం కాయిన్లు, ఆభరణాల(ఫిజికల్) కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభావం చూపుతోంది. ఫలితంగా 2007లో ప్రారంభమైన గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్స్ 2 మిలియన్ ఔన్స్‌ల(64 టన్నులు)కు చేరినట్లు తెలియజేశాయి. 2024లో గోల్డ్ ఈటీఎఫ్‌లలో కేవలం 0.5 మిలియన్ ఔన్స్‌లు(15 ట న్నులు) జమయ్యాయి. అయితే 2024కల్లా గత నాలుగేళ్ల కాలంలో ఇవి 27.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు పుంజుకున్నాయి. 2025లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. కాగా.. ఈ ఏడాది(2025)లో ఇప్పటివరకూ వెండి ధరలు 75 శాతం దూసుకెళ్లగా.. పసిడి 55 శాతం బలపడిన విషయం విదితమే.
పసిడి రూ. 3,500 జూమ్
⇒ ఢిల్లీలో రూ. 1,28,900కి గోల్డ్
⇒ వెండి కూడా రూ. 5,800 అప్
న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి పరు గు తీశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం 99.9% స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ. 3,500 పెరి గి రూ. 1,28,900కి చేరింది. వెండి ధర కూడా కిలోకి రూ. 5,800 పెరిగి రూ. 1,60,800కి చేరింది. మరోవైపు, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ పసిడి కాంట్రాక్టు ధర రూ. 1,458 ఎగిసి ఒక దశలో రూ. 1,25,312 వద్ద ట్రేడయ్యింది. వెండి కూడా రూ. 2,583 మేర ఎగిసి రూ. 1,57,065 వద్ద ట్రేడయ్యింది. న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి డిసెంబర్ కాంట్రాక్టు ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 47.8 డాలర్లు పెరిగి 4,142 డాలర్ల స్థాయిని తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రేటు 1.94 శాతం పెరిగి 51.30 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.


