బంగారం ధరలు కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని సార్లు అమాంతం తగ్గిపోతుంటాయి. ఇలా పెరుగుతూ.. తగ్గుతూ తులం గోల్డ్ రేటు రూ. 1.20 లక్షలు దాటేసింది. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి?, ధరలు తగ్గడానికి దోహదపడే అంశాలు ఏమిటనేది.. ఇక్కడ తెలుసుకుందాం.
గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణాలు
ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగితే.. కరెన్సీ విలువ తగ్గుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో పసిడి ధర అమాంతం పెరుగుతుంది.
ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు & ఆర్థిక అస్థిరత: ప్రపంచ యుద్దాలు, రాజకీయ పరిణామాలు, ఆర్ధిక సంక్షోభాలు పెరిగినప్పుడు.. సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది కూడా బంగారం ధర పెంచడానికి కారణమవుతుంది.
రూపాయి / డాలర్ విలువ: రూపాయి విలువ లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు కూడా ప్రజలు బంగారంపైన పెట్టుబడి పెడతారు. ఈ సమయంలో ఆయాదేశాలు దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.
పండుగ సీజన్స్: ముఖ్యంగా భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం పండుగ సీజన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే దీపావళి, ధనత్రయోదశి వంటి పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని భావించే చాలామంది ఫాల్స్ కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతుంది.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు: ప్రపంచ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచితే మార్కెట్లో.. గోల్డుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే.. ధరలు తప్పకుండా పెరుగుతాయి.
బంగారం ధరలు తగ్గడానికి కారణాలు
ఆర్థిక పరిస్థితులు: ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడినప్పుడు పెట్టుబడిదారులు బంగారానికి ప్రత్యామ్నాయంగా.. స్టాక్ మార్కెట్, బాండ్స్ వంటి అధిక రిటర్న్స్ ఇచ్చే వాటిమీద పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ధరలు కూడా తగ్గుతాయి.
డాలర్ విలువ: డాలర్ విలువ పెరిగినప్పుడు.. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపరు. దీంతో గోల్డ్ రేటు తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.
వడ్డీ రేట్లు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచితే.. డిపాజిట్లు, బాండ్స్ వైపు తిరుగుతారు. ఇది గోల్డ్ మీద ఆసక్తిని తగ్గిస్తుంది. ధరలు ఆటోమాటిక్‌గా తగ్గుతాయి.
సెంట్రల్ బ్యాంకులు: సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మినప్పుడు కూడా గోల్డ్ రేటు తగ్గుతుంది.
సీజన్: పండుగలు, పబ్బాలు లేనప్పుడు చాలామంది సాధారణ ప్రజలు బంగారం కొనాలనే ఆలోచన చేయరు. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గుతాయి.
''ఒక్కమాటలో చెప్పాలంటే.. పసిడికి డిమాండ్ పెరిగితే, ధరలు పెరుగుతాయి. డిమాండ్ తగ్గితే.. ధరలు కూడా తగ్గుతాయి.''
ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు


