వచ్చే ఏడాది (2026) ఆఖరు నాటికి కొత్తగా 26 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ (Air India CEO Campbell Wilson) వెల్లడించారు. అలాగే అప్‌గ్రేడ్ చేసిన విమానాలతో 81 శాతం ఇంటర్నేషనల్ సర్వీసులను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అయితే, మొత్తం మీద విమాన ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వివరించారు.
‘ఏఐ 171 క్రాష్ కావచ్చు లేదా ఇతరత్రా పరిస్థితులు కావచ్చు గత కొద్ది నెలలుగా ఎదురైన ప్రతికూలతలు ఎలా ఉన్నా, 2026లో ఎయిరిండియాలో సుస్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మేము పెట్టుబడుల ప్రణాళికలను కొనసాగిస్తున్నాం‘ అని విల్సన్ చెప్పారు. ‘కొత్త విమానాలు వస్తున్నా, కొన్ని విమానాలను లీజుదార్లకు తిరిగి ఇచ్చేయనుండటం, చాలా మటుకు విమానాలకు రెట్రోఫిట్ చేస్తుండటం వల్ల వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్యాపరంగా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.
ఎయిరిండియా గ్రూప్‌లో ప్రస్తుతం 300 విమానాలు (ఎయిరిండియాకి 187, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కి 110 విమానాలు) ఉన్నాయి. ఎయిరిండియా వద్ద సుదీర్ఘ దూరాలకు ప్రయాణించగలిగే బోయింగ్ 777 విమానాలు 22, అలాగే బోయింగ్ 787 రకం విమానాలు 32 ఉన్నాయి. వచ్చే ఏడాది ఎయిరిండియాకు 20 చిన్న విమానాలు, 6 పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తాయని విల్సన్ చెప్పారు. 2026 ఆఖరు నాటికి బోయింగ్ 787 విమానాల్లో మూడింట రెండొంతుల ఎయిర్‌క్రాఫ్ట్‌లు అప్‌గ్రేడ్ అవుతాయని వివరించారు.


