న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అంటే ఏదో హైప్ కాదని, దీని వల్ల ఎంతో సమయం అవుతోందని లాజిస్టిక్స్ టెక్ సంస్థ షిప్‌రాకెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాహిల్ గోయల్ తెలిపారు. దాన్ని చెడుగా భావించకుండా, సద్వినియోగం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.
ప్రతి పరిశ్రమలో కీలక మార్పులు తెచ్చే సత్తా ఏఐకి ఉందనే విషయం గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఏఐ కంపెనీల వేల్యుయేషన్లపై విమర్శలు, ఇది ఎప్పుడైనా పేలిపోయే బుడగలాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఏఐ వేల్యుయేషన్స్ అనేవి మార్కెట్‌కి సంబంధించినవని, దీన్ని విస్తృత ఉపయోగాల గురించి వేరుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీర్ఘకాలంలో ఏఐ సాధనాలు మనకు అనుకూలంగా పని చేస్తాయన్నారు. కృత్రిమ మేథతో రోబోటిక్స్‌లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని గోయల్ తెలిపారు. దీని గురించి ప్రజలు తెలుసుకుని, నేర్చుకుని, ఉపయోగించడం మొదలుపెట్టాలని గోయల్ పేర్కొన్నారు.


