రీడిజైన్ దిశగా అడుగులు.. అకడమిక్ ఆడిట్ మొదలు
పనికొచ్చే కోర్సులేవి... తీసివేయాల్సినవేవి?
వర్సిటీలకు లేఖలు రాయనున్న ఉన్నత విద్యామండలి
ఇతర దేశాల నాణ్యతను పాటిద్దాం.. వచ్చే ఏడాది నుంచి భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల రీడిజైన్ మొదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఈ దిశగా స్పీడ్ పెంచారు. అకడమిక్ ఆడిట్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కోర్సులపై సమగ్ర వివరాలు పంపాలని లేఖలు రాయబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులతోపాటు కొన్ని కోర్సులకు ఉద్వాసన పలికే అవకాశముందని మండలి వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయంగా డిగ్రీ కోర్సుల ద్వారా ఉపాధి లభించే విధంగా కొత్తదనాన్ని మేళవించే ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసి..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ సహా కొత్త అప్లికేషన్స్ పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రతీ సబ్జెక్టులోనూ 20% మేర ఆధునిక సాంకేతిక చాప్టర్లకు రంగం సిద్ధం చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా సిలబస్ రూపకల్పనలో ఉన్నారు. త్వరలో కోర్సులపై సీఎం రేవంత్‌రెడ్డికి బాలకిష్టారెడ్డి నివేదిక ఇవ్వబోతున్నారు.
సగం సీట్లు కూడా భర్తీ కావట్లేదు
డిగ్రీ కోర్సులకు అరకొర స్పందనే వస్తోంది. రాష్ట్రంలో 957 డిగ్రీ కాలేజీల్లో 4,36,947 సీట్లు అందుబాటులో ఉంటే, మూడు విడతల దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత కూడా చేరిన విద్యార్థుల సంఖ్య 2.15 లక్షలే. ప్రతీ సంవత్సరం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయ్యే నాటికి కొన్నేళ్లుగా గరిష్టంగా 2.20 లక్షల మంది మాత్రమే చేరుతున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చేరేవారి సంఖ్య 37 శాతం మించడం లేదు.
గ్రామీణ ప్రాంత కాలేజీల్లో అతి తక్కువమంది చేరుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో ఉన్న కాలేజీల్లో కొంతమేర సీట్లు భర్తీ అవుతున్నాయి. డిగ్రీ చదివే విద్యార్థులు పార్ట్ టైం పనిచేసుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అవకాశాలుంటున్నాయి. దీంతోపాటు డిగ్రీ తర్వాత ఉపాధి పొందే స్కిల్ కోర్సులు నేర్చుకునేందుకు రాజధాని వేదికగా మారింది. దీంతో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో విద్యార్థుల చేరికలు పెద్దగా ఉండటం లేదు. ఒకవేళ డిగ్రీలో చేరాల్సి వస్తే ప్రభుత్వ కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నారు.
⇒ఇప్పటి వరకూ దోస్త్ ద్వారా ఎక్కువ మంది బీకాం కోర్సులోనే చేరారు.
⇒1,41,590 మంది వివిధ కోర్సుల్లో చేరితే, ఇందులో అత్యధికంగా బీకాంలో 54,771 మంది చేరారు.
⇒ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 27,059 మంది చేరారు
⇒బీఏ కోర్సులో 60,414 సీట్లు ఉంటే, చేరిన విద్యార్థులు మాత్రం 19,104 మాత్రమే
⇒ఇటీవల కాలంలో బీబీఏ కోర్సుకు కొంత ఆదరణ పెరిగింది. ఈ కోర్సులో 11,462 మంది చేరారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు కంప్యూటర్ కాంబినేషన్ ఉన్న కోర్సులను మాత్రం విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
కొత్త కోర్సులుంటేనే అనుమతి
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనూ కూడా సీట్ల కుదింపు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నారు. మార్కెట్ అవసరాలు తీర్చే కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తేనే అనుమతులు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. అకడమిక్ ఆడిట్‌ను ఈ దిశగానే రూపొందిస్తున్నారు. కనీసం ఐదేళ్లుగా ఏఏ కోర్సుల్లో, ఏఏ కాలేజీల్లో ఎంతమంది చేరుతున్నారనే డేటా తీస్తున్నారు. విద్యార్థులు ఇష్టపడని కాలేజీలు, కోర్సులను ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నారు.
వీటిస్థానంలో టెక్నాలజీతో మిళితమైన కోర్సులను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే డిగ్రీ కోర్సుల స్వభావం మారింది. డేటాసైన్స్ సహా పాలనపరమైన మెళకువలు ఉండే కొత్త కోర్సుల కాంబినేషన్ తీసుకొచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఈ దిశగా మార్పులు సూచించింది. ఫ్యాకల్టీ సమస్య ఉన్న కాలేజీలు ఆన్‌లైన్‌లో ఇతర విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకుల సేవలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోనూ ఈ దిశగా జరుగుతున్న కసరత్తుపై వచ్చేవారం స్పష్టత వస్తుంది.
అకడమిక్ ఆడిట్ చేస్తాం
డిగ్రీ కోర్సులను పూర్తిగా మార్చబోతున్నాం. పారిశ్రామిక భాగస్వామ్యంతో స్కిల్ ఉండేలా, ఇతర దేశాల్లోనూ ఉపాధికి బాటలు వేసేలా వీటిని రూపొందించాలనే ఆలోచేన చేస్తున్నాం. కోర్సులు, సీట్ల పరిస్థితిపై అకడమిక్ ఆడిట్ చేపడుతున్నాం. అన్ని విశ్వవిద్యాలయాల సహకారం తీసుకుంటున్నాం. త్వరలోనే కొత్త విధానంపై స్పష్టత ఇస్తాం.
– ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్


