ప్రపంచ దేశాలన్నీ కలిసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
కఠినమైన నిబంధనలు తీసుకురావాలి
క్లీన్ ఎనర్జీ వినియోగం మరింత పెరగాలి
ప్రకృతి విపత్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలి
పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి
జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
జోహన్నెస్‌బర్గ్: ఆధునిక యుగంలో అవసరాల సృష్టించుకున్న కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా సరే మానవ కేంద్రీకృతగా ఉండాలి తప్ప ఆర్థిక కేంద్రీకృతంగా ఉండరాదని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేర్వేరు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు.
టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలని సూచించారు. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలని తెలిపారు. ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నామని వివరించారు. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఐఏ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
ఏఐ వాడకంలో జవాబుదారీతనం
కృత్రిమ మేధ అనేది ప్రపంచ అభివృద్ధి, మానవాళి బాగుకోసం ఉపయోగపడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. దుర్వినియోగం చేస్తే భారీ నష్టం జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. డీప్‌ఫేక్, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐని విచ్చలవిడిగా వాడుకోవడానికి వీల్లేకుండా పారదర్శకత కోసం పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఏఐ డిజైన్‌లోని భద్రతాపరమైన ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ వ్యవస్థలు మానవ జీవితాన్ని, భద్రతను, ప్రజా విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంటాయని గుర్తుచేశారు. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ వాడకానికి పెద్దపీట వేయాలన్నారు. ఇందులో జవాబుదారీతనం ఉండాలన్నారు. కృత్రిమ మేధ మానవ శక్తి సామర్థ్యాలను పెంచే మాట వాస్తవమే అయినప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకొనే బాధ్యత మనుషులపైనే ఉండాలని తేలి్చచెప్పారు.
ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం
ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వాడకం నుంచి క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయాణం ఆరంభించాలని, శిలాజేతర ఇంధనాల వినియోగం పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ కోసం రీసైక్లింగ్‌ను మరింత వేగవంతం చేయాలని, సప్లై చైన్‌పై ఒత్తిడి తగ్గించాలని, అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, వినియోగం విషయంలో ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని చెప్పారు. క్లీన్ ఎనర్జీ సహా కీలక రంగాల్లో సహకారం కోసం జీ20 దేశాల శాటిలైట్ డేటాను అందరూ సులువుగా ఉపయోగించుకొనేలా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఇందుకోసం ‘జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యాన్ని’మోదీ ప్రతిపాదించారు. వ్యవసాయం, మత్స్య సంపద, విపత్తుల నిర్వహణకు జీ20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని కోరారు. ఆధుని కాలంలో ప్రకృతి విపత్తులు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని, కోట్లాది మంది ప్రభావితమయ్యారని తెలిపారు. అందుకే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రపంచదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తేలిచెప్పారు.
ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదని, అందుకోసం ఉమ్మడి కృషి అవసరమని ఉద్ఘాటించారు. విపత్తుల సన్నద్ధత, సుస్థిర వ్యవసాయం, ప్రజారోగ్యం, పౌష్టికాహారం వంటి అంశాలను అనుసంధానించాలని, దీనిపై సమగ్ర వ్యూహాలు రూపొందించాలని జీ20 దేశాలకు నరేంద్రమోదీ సూచించారు. ఇండియాలో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్–లైఫ్ బ్యాటరీస్‌తోపాటు సంబంధిత రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ‘జీ20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులేటరీ కార్యక్రమం’ప్రారంభించాలని ప్రతిపాదించారు.
ప్రమాదంలో ఆహార భద్రత
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, ప్రజలకు పోషకాహారం అందడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే వాతావరణ మార్పుల నియంత్రణపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇండియాలో అతిపెద్ద ఆహార భద్రత, పోషకాహార కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా, పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడానికి తృణ ధాన్యాల సాగు, విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.


