సాక్షి, హైదరాబాద్: అధికారం ఉంది కదా అని మోదీ సర్కార్ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని.. పేదలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం మార్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా.. గురువారం గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.
.. బ్రిటీష్ పాలన తరహాలో మోదీ పాలన ఉంది. ఎన్డీయే కూటమికి అనుకున్నంత మెజారిటీ రాకపోవడంతో రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. అందుకే వేరే రూపంలో హక్కులను కాలరాస్తున్నారు. ఓటు హక్కు తీసేసే కుట్రలో భాగంగా ఎస్‌ఐఆర్ తీసుకొచ్చారు. కోట్లాది మంది పేదలను దేశ పౌరులే కాదని చూపించేందుకు కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతోంది
ఉపాధి హామీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భూమిలేని పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల గ్రామాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వలసలు ఆగిపోయాయి.. వెట్టిచాకిరీ ఆగింది. దేశంలో 80 శాతం ప్రజలు ఈ పథకం ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పథకాన్ని మార్చి పేదలకు అన్యాయం చేస్తున్నారు. పేదలపై కక్ష పూరితంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అదానీ, అంబానీలకు తక్కువ ధరకు కూలీలు దొరకడం లేదని పథకాన్ని మారుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే ఇలా చేస్తున్నారు.
గతంలో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలను ఉపసంహరించుకునేలా చేయడమే కాకుండా మోదీతో జాతికి క్షమాపణ చెప్పించింది కాంగ్రెస్. ఇప్పుడు అదే పని చేయబోతున్నాం. మోదీ క్షమాపణలు చెప్పేంత వరకు వదిలేది లేదు. ఉపాధి హామీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఈ నెల 20 నుంచి గ్రామ సభలు నిర్వహిద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నేను కూడా ఓ మండలం బాధ్యత తీసుకుంటా. అన్ని మండలాలకు ఒక్కొకకకరు బాధ్యత తీసుకోవాలి. ఫిబ్రవరి 3 నుంచి అన్ని జిల్లాల్లో రోజుకు లక్ష మందితో సభ పెడదాం. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో సభలు పెడతాం. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేంత వరకు మోదీ సర్కార్‌పై యుద్ధం ఆగదు..
బీఆర్‌ఎస్‌ను వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడించాం. మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచి తీరతాం. బీఆర్‌ఎస్, బీజేపీలకు రాజకీయాలే తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదు. వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారు అని రేవంత్ అన్నారు.


