ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) తీవ్ర ఆరోపణలకు దిగింది. ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం జరిపిన తనిఖీల సందర్భంగా తమతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెబుతోంది. అంతేకాదు.. తాము రికవరీ చేసిన ఆధారాలను పట్టుకుపోయారని ఆరోపిస్తోంది.
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోల్‌కతా సహా దేశంలోని ఐప్యాక్‌కు చెందిన పలు చోట్ల ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం వద్ద సోదాలు జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కడికి సీఎం మమతా బెనర్జీ సీపీ మనోజ్ బెనర్జీతో కలిసి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే కాసేపటి తర్వాత జైన్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె చేతిలో.. ఓ ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్, పలు డాక్యుమెంట్లతో కూడిన గ్రీన్ ఫైల్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె మీడియాతో.. బెంగాల్ ఎలక్షన్స్ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ తమను లక్ష్యంగా చేసుకుందని.. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని ఆమె మండిపడ్డారు కూడా. అయితే ఆమె ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది.
ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. పక్కా ఆధారాలతోనే ఈ తనిఖీలు నిర్వహించాం. ఎక్కడా కూడా ఏ పార్టీ కార్యాలయాన్ని టచ్ చేయలేదు. ఏ ఎన్నికలతోనూ మాకు సంబంధం లేదు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు. అంతా చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాం అని ఈడీ ప్రకటించింది. అలాగే.. ఆ సమయంలో ఆమె తమ నుంచి బలవంతంగా పత్రాలను, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను లాక్కున్నారని ఆరోపించింది. అంతేకాదు.. ఈ పరిణామంపై ఈడీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. తమ విధులకు ఆటంకం కలిగించారని, ఆధారాలను తీసుకెళ్లారని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపు.. నేటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధం. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారు. మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డిస్క్‌ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు అని దీదీ మండిపడ్డారు.
అయితే మమతా బెనర్జీ చేసింది ఈడీ దాడుల్లో జోక్యం చేసుకోవడమేనని ప్రతిపక్ష బీజేపీ మండిపడుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఆమె ప్రవర్తన అనైతికం అన్నారు.


