పరాయి దేశాల్లో సైనిక కుట్రలు, కుయుక్తుల మాటెలావున్నా అగ్రరాజ్యం హోదాలో అమెరికా నాగరికంగా, గంభీరంగా ఉన్నట్టు కనబడేది. తాను ఏం చేసినా ప్రపంచశాంతి కోసమే, అది సురక్షితంగా ఉండటానికేనని ప్రవచించేది. నిరుడు ఆ దేశాధ్యక్షపీఠాన్ని అధిరోహించిన డోనాల్డ్ ట్రంప్‌కు ఇలాంటి డొంకతిరుగుడు నచ్చదు. బాహాటంగా బెదిరింపులకు దిగటం ఆయన నైజం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనను ఆనందడోలికల్లో ముంచెత్తడానికి భారత్ ప్రయత్నిస్తోందట. అయితే తాను సంతోషంగా లేని విషయం మోదీకి తెలుసట. మరో రెండు రోజులకు దాన్ని కాస్త మార్చి, తనతో మోదీ సంతోషంగా లేరంటూ మరో ప్రకటన చేశారు.
ఇలా మాట్లాడుతూనే రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు నిలిపేయకపోతే సుంకాలు మరింత పెంచుతామని హెచ్చరించారు. రెండు దేశాల దౌత్యసంబంధాలు లేదా వాణిజ్యసంబంధాల్లో ఏకాభిప్రాయం కుదరనప్పుడు పరస్పరం చర్చించుకోవటం ఆనవాయితీ. ఇచ్చిపుచ్చుకునే ధోరణి చూపితే ఎక్కడో ఒకచోట సదవగాహన సాధ్యమవుతుంది. కానీ ఫలానాది మాత్రమే కావాలని పట్టు బట్టడం, మొండికేయటం వల్ల సమస్య ఎప్పటికీ అపరిష్కృతంగా ఉండి పోతుంది. మన దేశానికి మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఒమన్‌లతో ఒప్పందాలు కుదిరాయి.
అటు అమెరికాకు ఈయూ, జపాన్, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియాలతో ఇదే విధంగా ఒప్పందాలు ఏర్పడ్డాయి. ఇలా వేరే దేశాలతో ఈ రెండు దేశాలూ ఒప్పందాలు కుదుర్చుకోగలిగినప్పడు వాటి మధ్య మాత్రం ఒప్పందాలు ఎందుకు అసాధ్యమవుతున్నాయి? తమ భద్రత అమెరికా చేతుల్లో ఉండటంతో వేరే దేశాలు అమెరికా షరతులను శిరసావహించక తప్పదు. వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రత పాటించే వారిని ఒత్తిళ్లు ప్రభావితం చేయలేవు. అందువల్లనే భారత్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అంత తేలిగ్గా సాధ్యపడవు.
ట్రంప్‌ను సంతోషపెట్టడం వేరే దేశాల బాధ్యత ఎందుకవుతుంది? అసలు ఆ బాధ్యత అమెరికా ప్రజలకే ఉండదు. అన్ని దేశాల పాలకుల మాదిరే తన దేశ ప్రజలు ఆనందంగా ఉండేలా చూసుకునే బాధ్యత ట్రంప్‌ది. ఆయన్ను అందుకు ఒప్పించటం రిపబ్లికన్ల బాధ్యత. లేనట్టయితే నష్టపోయేది ఆ పార్టీయే. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని గప్పాలు కొట్టుకున్నట్టే భారత్ తనను సంతోషపరచటానికి ప్రయత్నిస్తోందని ట్రంప్ చెప్పారా? ఈ విషయంలో మన దేశంవైపు నుంచి ఖండనేమీ లేదు.
వాణిజ్య ఒప్పందం అనేది చాలా సీరియస్ అంశం. బహిరంగ వేదికలపై దాన్ని చర్చించటం సాధ్యపడదు. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారానో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోనో కూర్చునో తోచింది చెప్పటం, అందుకు అనుగుణంగా అవతలి దేశం మారాలని, కాళ్లబేరానికి రావాలని భావించటం... అది సాధ్యపడనప్పుడు హెచ్–1బి వీసా ఫీజు పెంచటం, బహిరంగ విమర్శలకు దిగటం ట్రంప్ ఎన్నుకున్న తప్పుడు మార్గం.
నిజానికి మన దేశం చాలావరకూ తగ్గిందనే చెప్పాలి. నిరుటితో పోలిస్తే అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు 80 శాతం పెరిగాయి. 1962లో వచ్చిన అణుశక్తి చట్టాన్ని ఇటీవల రద్దుచేసి ఆ రంగంలో ప్రైవేటు సంస్థల ప్రమేయానికి అనుమతిస్తూ మన దేశం ‘శాంతి’ పేరిట కొత్త చట్టం తెచ్చింది. అణువిద్యుత్ కర్మాగారాల్లో ప్రమాదం జరిగితే పరిహారం చెల్లింపు బాధ్యత ఆ పరికరాల సరఫరాదారుకు ఉండబోదన్న విషయంలోనూ అంగీకరించింది. ఇవి తనను సంతోషపరచటానికేనని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది.
అవి ఎంతమాత్రమూ సరిపోవని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం కావొచ్చు. ఇక 95 శాతం అమెరికా ఎగుమతులపై సుంకాలు ఎత్తేయటానికి మన దేశం సిద్ధపడింది. బాదం, యాపిల్, అవకాడో వంటివాటిపై సుంకాలు తగ్గించటానికి ఒప్పు కున్నదంటున్నారు. కానీ డెయిరీ ఉత్పత్తులు, జన్యుమార్పిడి మొక్కజొన్న,సోయా బీన్స్ వగైరాలపై ఆంక్షలొద్దన్న ట్రంప్ షరతుకు అంగీకరించటం లేదు. మన రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేవి మాత్రమే ఆయనను సంతోష పరుస్తాయనుకుంటే ఆ విషయంలో చేయగలిగిందేమీ లేదని మన దేశం చెప్పటమేసరైంది.


