కొన్ని రోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘జపం’ చేస్తున్నారు. మోదీ మంచి వ్యక్తి అని అంటూనే భారత్ తనను సంతృప్తి పరచడానికి యత్నిస్తుందని తనలోని అసంతృప్తి ఇంకా మిగిలే ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ట్రంప్‌ను ఇంకా ఇంకా భారత్ సంతోష పెట్టాల్సిన విషయం ఏమైనా ఉందంటే అది.. రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయడమే. రష్యాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ చమురు కొనుగోలు చేస్తుంది.. ఇప్పడు ట్రంప్‌ను సంతోష పరచడానికి ఆ కొనుగోలును ఎలా నిలిపివేస్తందనేది సామాన్యుడికి మెదిలే ప్రశ్న.
ట్రంప్ మాటే నెతన్యాహూకు శిరోధార్యం
ఇదిలా ఉంచితే, నిన్న(బుధవారం, జనవరి 7 వ తేదీ) ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరుదేశాల ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గాజా శాంతి ప్రణాళిక అమలు గురించి మోదీకి నెతన్యాహు సవివరంగా తెలియజేశారు. ఇదంతా ఒకటైతే.. ఇక్కడ మరొక విషయం చర్చకు దారి తీసింది. అదే ట్రంప్ వ్యూహం.
నెతన్యాహూ.. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. ట్రంప్ ఏం చెబితే అది నెతన్యాహూకు శిరోధార్యం. అది ఇరాన్‌తోయుద్ధంతో రుజువైంది. ఇరాన్‌తో యుద్ధం చేయమంటే చేశారు.. ఆపేయమంటే ఆపేశారు నెతన్యాహూ.
ట్రంప్‌తో భేటీ తర్వాత వార్నింగ్‌ల పరంపరం
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు నెతన్యాహూ. ట్రంప్‌తో కలవడానికి వెళ్లే ముందు ఇజ్రాయిల్ ఆర్మీకి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సైనిక చర్యలొద్దు అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ట్రంప్‌ను కలిసొచ్చిన తర్వాత చూద్దాం అని కూడా చెప్పారు. ఆ తరువాత అంటే ట్రంప్‌తో భేటీ ముగించుకుని ఇజ్రాయిల్‌కు వచ్చిన గంటల వ్యవధిలోనే లెబనాన్‌పై దాడులు చేసింది ఇజ్రాయిల్ వైమానిక దళం. దక్షిణ లెబనాన్‌లోని కొన్ని స్థావరాలపై దాడులు చేశారు. అక్కడ హెజ్‌బుల్లా ఆనవాళ్ల ఉన్నాయని అందుకే అక్కడ దాడులు చేశామని పేర్కొన్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులకు పాల్పడ్డాయి. దీనిపై లెబనాన్ తీవ్రంగా మండిపడింది. ఇజ్రాయిల్ దుశ్చర్యకు తెరలేపిందంటూ ధ్వజమెత్తింది.
ఇదిలా ఉంచితే,. ట్రంప్‌తో భేటీ తర్వాత ఇరాన్‌ను పరోక్షంగా హెచ్చరించింది ఇజ్రాయిల్. వెనెజువెలాలో ఏం జరిగిందో చూశారుగా అంటూ ఇరాన్‌ను హెచ్చరించింది. మీరు దారికి రాకపోతే వెనెజువెలాలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అని ఇజ్రాయిల్ నేత ఒకరు వ్యాఖ్యానింఆరు. ఇదంతా అమెరికా అండగా చూసుకునే ఇజ్రాయిల్ ఇలా చేస్తుందనేది కాదనలేని సత్యం.
మోదీకి నెతన్యాహూ ఫోన్.. దేనికి సంకేతం?
మోదీకి సైతం నెతన్యాహూ ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాల గురించి, గాజాలో శాంతి గురించి, ఉగ్రవాదంపై పోరు గురించి మోదీతో నెతన్యాహూ ఫోన్‌లో చర్చించారనేది ప్రధాన సారాంశం. ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చ జరిగినా దేశ భవిష్యత్‌కు సంబంధించి కార్యాచరణ చర్చలే ఉంటాయి. ఇక్కడ కూడా అదే అనుకోవచ్చు. కానీ కొన్ని రోజులుగా భారత్, మోదీ అంటూ ప్రస్తావిస్తూ వస్తున్నారు ట్రంప్. తనను పూర్తిగా భారత్ సంతృప్తి పరచలేదంటూ వ్యాఖ్యానించారు కూడా.
అయితే మోదీకి నెతన్యాహూ ఫోన్ అనేది ట్రంప్ వ్యూహంలో భాగం కాదనే విషయం కొట్టిపారేయలేం అని అంటున్నారు పలువురు విశ్లేషకులు. భారత్-అమెరికాల మధ్య పూర్తిగా సఖ్యత చెడిపోకపోయినప్పటికీ, కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆపరేషన్ సిందూర్ దగ్గర్నుంచి, సుంకాల పెంపు వరకూ ఇరు దేశాలు కాస్త దూరం పాటిస్తూ వస్తున్నాయి. అయితే భారత్‌తో శత్రుత్వం అంత మంచిది కాదని అమెరికా ప్రముఖలే వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ ఈ రకంగా పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ పర్యటనకు ఓకేనా?
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ఎప్పుడో భారత్ పర్యటనకు రావాలి. భారత్ పర్యటనకు వస్తానని గతంలో ఆయనే స్వయంగా ప్రకటించిన తరువాత.. ఆ పర్యటన నవంబర్ నుంచి డిసెంబర్‌లోపు ఉంటుందని భావించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు జనవరి వచ్చేసింది. అయితే నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లారు కానీ భారత్ పర్యటనపై ఎటవంటి ప్రకటన చేయలేదు. అయితే భారత్ పర్యటనకు రావడానికే ముందుగా మోదీకి ఫోన్ చేసి టచ్‌లోకి వచ్చారంటున్నారు పలువురు విశ్లేషకలు.
ఇదంతా కూడా ట్రంప్‌తో నెతన్యాహూ భేటీ తర్వాతే జరిగింది. అంటే నెతన్యాహూ భారత్‌లో పర్యటించడానికి కూడా ట్రంప్‌ను అడిగి ఉండొవచ్చనేది ఒక వాదనగా ఉంది. భారత్ పర్యటనకు నెతన్యాహూ చేపట్టడానికి ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉంటారని, అందుకే ముందస్తుగా ఇలా ఫోన్‌లతో మాటామంతీ కలుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి:
ట్రంప్ అసంతృప్తి లోగుట్టు!


