హైదరాబాద్: నగరంలోని జీనోమ్ వ్యాలీ ఇన్నోవేషన్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తరించింది. భారతదేశంలోనే తొలి సింగిల్-యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్ స్కేల్-అప్ సదుపాయం తెలంగాణ వన్ బయో (1 BIO)ను ప్రారంభించింది. దేశ బయోలాజిక్స్, తదుపరి తరం చికిత్సా సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ఇదిఒక పరివర్తనాత్మక దశను సూచిస్తుంది.
భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబిటీ), తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) సహకారంతో తెలంగాణ లైఫ్‌సైన్సెస్ నేపథ్యంతో వన్ బయోను జీనోమ్ వ్యాలీలోని 2 ఎకరాల క్యాంపస్‌లో తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఫార్చ్యూన్ 500 గ్లోబల్ లీడర్ అయిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బయోప్రాసెస్ డిజైన్ సెంటర్, భారత్తోపాటు పెరుగుతున్న ప్రపంచ బయోలాజిక్స్ పైప్‌లైన్‌కు అవసరమైన తదుపరి తరం సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో జీఎల్పీ, జీఎంపీ గ్రేడ్ బయోమోలిక్యూల్ అభివృద్ధిలో తెలంగాణను ముందంజలో ఉంచుతుంది.

జీనోమ్ వ్యాలీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కొత్త జీనోమ్ వ్యాలీ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర రహదారి వెంబడి జీనోమ్ వ్యాలీ ప్రవేశద్వారం వద్ద నిర్మించబోయే ల్యాండ్‌మార్క్ గేట్‌వే డిజైన్‌ను సైతం మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జీనోమ్ వ్యాలీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, దాని తదుపరి 25 సంవత్సరాలకు మార్గాన్ని నిర్దేశిస్తున్నాము. బయోలాజిక్స్ విస్తరణ అవకాశాలను మరింత మెరుగుపరచడం వైపు భారతదేశ అత్యంత ముఖ్యమైన చర్యలలో వన్ బయో ఒకటి’ అన్నారు.


