గంగిరెద్దులు మొదలు వంటకాల వరకు అన్నీ ఇక్కడే..
ప్రకృతి వనాలలో ఏర్పాటు.. ఫ్యామిలీల ఆసక్తి..
ఈ నెల 10 నుంచే సంబురాలకు ఏర్పాట్లు
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ నగరం ఖాళీ అయిపోతుంది. ఉద్యోగాలు, చదువులు, జీవన పోరాటాలతో నగరంలో స్థిరపడిన లక్షలాది మంది రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాల వైపు ప్రయాణం చేస్తారు. అంతటి విశిష్టమైన సంస్కృతి, సంప్రదాయ, అస్థిత్వపు పండుగ సంక్రాంతి. బస్సులు, రైళ్లు నిండిపోతాయి.. రోడ్ల మీద ఊర్లకు వెళ్లే వాహనాల వరుసలు కనిపిస్తాయి. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు.. ఇది మూలాలకు వెళ్లే భావోద్వేగ ప్రయాణం. కానీ ఈ అందమైన సంప్రదాయంలో అందరూ భాగస్వాములు కాలేకపోతున్నారు.
పని ఒత్తిడి, సెలవుల లేమి, కుటుంబ పరిస్థితులు, గ్రామాల్లో బంధాలు సడలిపోవడం వంటి అనేక కారణాల వల్ల కొందరికి సంక్రాంతి ప్రయాణం (Sankranti Journey) కుదరక నగరంలోనే ఉండాల్సి వస్తోంది. అప్పుడు ఆ పండుగ వారికి సెలవు దినంలా మారిపోతుంది. సంబరాల్లేని సంక్రాంతిగా మిగిలిపోతుంది. ఇలాంటి వారికోసమే ఇప్పుడు సిటీలో కొత్త ట్రెండ్ మొదలైంది. అవే ‘రెడీమేడ్ సంక్రాంతి సంబరాలు’.
– సాక్షి, సిటీబ్యూరో
ఈ వేడుకలకు నగరంలోనే కాదు, నగర శివార్లలోని ఫామ్ హౌస్‌లు, ప్రకృతి వనాలు, రిసార్ట్స్‌లు వేదికలుగా మారి పల్లెటూరి సంక్రాంతిని అచ్చంగా మళ్లీ సృష్టిస్తున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ముగ్గుల పోటీలు, పిండి వంటల రుచి, భోగి మంటల (Bogi Manta) వేడి, పతంగుల సందడి అన్నీ ఒకేచోట. పల్లెల్లో కనిపించే ఆ సౌందర్యాన్ని, ఆ సువాసనను నగరవాసులకు దగ్గర చేస్తున్నాయి ఈ ఈవెంట్స్.
ఎక్స్‌పీరియన్స్ ఈవెంట్స్..
ఇవి కేవలం సంప్రదాయాలను చూపించే కార్యక్రమాలే కాదు. నగర జీవనానికి (City Life) అవసరమైన ఓ భావోద్వేగ విశ్రాంతి కేంద్రాలు కూడా. రోజంతా ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చునే ఐటీ ఉద్యోగులకు, చిన్నపిల్లలతో ఇంటికే పరిమితమయ్యే కుటుంబాలకు, ఒంటరిగా ఉండే యువతకు ఈ సంబరాలు ఒక రకంగా మానసిక రిలీఫ్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ వేడుకల్లో తరం మారుతున్న సంక్రాంతి సంస్కృతి స్పష్టంగా కనిపిస్తోంది.
ఒకప్పుడు పండుగ అంటే ఊరు, పొలం, చెరువు, తాతమ్మల ఇల్లు. ఇప్పుడు అదే భావనను నగర పరిసరాల్లో ‘ఎక్స్‌పీరియెన్స్ ఈవెంట్స్’ రూపంలో ఆస్వాదిస్తున్నారు యువత. ఎడ్లబండ్ల దగ్గర ఫొటోలు, ముగ్గుల ముందు రీల్స్, భోగి మంటల చుట్టూ సెల్ఫీలు (Selfies) ఇవన్నీ సోషల్ మీడియా యుగంలో సంక్రాంతికి కొత్త గుర్తింపునిస్తున్నాయి.
సిటీలో సాంస్కృతిక పునరుజ్జీవనం..
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సంబరాలు కేవలం వెళ్లలేని వారి కోసమే కాదు, వెళ్లదలుచుకోని వారి కోసమూ మారుతున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు ‘‘ఇంత దూరం ప్రయాణం చేసి అలసిపోవడం కంటే, పిల్లలతో ఇక్కడే ప్రశాంతంగా పండుగ జరుపుకోవడం బెటర్ అని భావిస్తున్నారు. వారికి అవసరమైన ఆహారం, వినోదం, సంప్రదాయం.. అన్నీ ఒకేచోట దొరుకుతున్నాయి. ఈ ఈవెంట్స్‌లో ఇంకో ప్రత్యేకత సాంస్కృతిక పునరుజ్జీవనం. గ్రామాల్లో తగ్గిపోతున్న కొన్ని సంప్రదాయాలు ఇప్పుడు నగరంలో కొత్త ఊపిరి తీసుకుంటున్నాయి. హరిదాసుల బృందాలు, గంగిరెద్దుల కళాకారులు, జానపద గాయకులు వీరందరికీ ఈ సంబరాలు ఒక కొత్త వేదికగా మారుతున్నాయి. కళకు గౌరవం, కళాకారులకు ఆదాయం.. రెండూ కలిసి వస్తున్నాయి.
సాంస్కృతిక రూపాంతరం..
ఈ సంక్రాంతి ఈవెంట్స్ ఒక ఫ్యామిలీ బాండింగ్ స్పేస్‌గా కూడా మారాయి. చిన్నపిల్లలు పల్లెటూరి ఆటలను తొలిసారి చూస్తున్నారు. తల్లిదండ్రులు తమ బాల్యంలోని జ్ఞాపకాలను మళ్లీ జీవిస్తున్నారు. తాతమ్మలు, నానమ్మలు పిల్లలకు సంప్రదాయాల కథలు చెబుతున్నారు. ఈ మూడు తరాల కలయికే ఈ సంబరాల అసలైన అందం. ఎంట్రీకి రుసుము తీసుకుంటున్నారు. కానీ అనివార్య కారణాలతో దూరమయ్యే పండుగను మళ్లీ దగ్గర చేసుకునే అవకాశం దొరికితే, అది ఖర్చు కాదు.. ఒక అనుభవంలో పెట్టుబడి.
చదవండి: పండక్కి ఊరెళుతున్నారా.. ఇలా చేయండి..
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ రోజుల్లో సంక్రాంతి కేవలం గ్రామాల్లోనే కాదు.. నగరంలో కూడా పల్లెటూరి హృదయంతో పండువగా మారుతోంది. పల్లెను మరిచిపోయిన నగరవాసులకు, నగరంలోనే పల్లెను పరిచయం చేస్తున్నాయి ఈ రెడీమేడ్ సంక్రాంతి సంబరాలు. ఇది ట్రెండ్ మాత్రమే కాదు.. మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్న సంప్రదాయం.


