సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి తెరతీస్తోంది. ఈ నెల 26న ముగియనున్న బైబ్యాక్‌లో భాగంగా షేరుకి రూ. 1,800 ధర మించకుండా చెల్లించనుంది. ఇందుకు రూ. 18,000 కోట్లవరకూ వెచ్చించనుంది. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది.
ఇది కంపెనీ ఈక్విటీలో 2.41 శాతం వాటాకు సమానంకాగా.. అర్హతగల వాటాదారులు నవంబర్ 20–26 మధ్య కాలంలో షేర్లను విక్రయించేందుకు(టెండర్) వీలుంటుంది. మధ్యకాలానికి కంపెనీ నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక మిగులు నిధులను వాటాదారులకు పంచే యోచనతో బైబ్యాక్‌కు ఉపక్రమించింది.
రెండు విభాగాలుగా..
కంపెనీ మూలధన కేటాయింపుల విధానం ప్రకారం బైబ్యాక్‌ను రెండు విభాగాలుగా చేపడుతున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. సాధారణ కేటగిరీతోపాటు.. చిన్న వాటాదారులకు రిజర్వ్‌డ్ విభాగాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రిజర్వేషన్ విభాగంలో వాటాదారుల ఈక్విటీ షేర్ల సంఖ్యలో 15 శాతం లేదా ఇందుకు అర్హమైన ఈక్విటీ షేర్ల సంఖ్యలో ఏది ఎక్కువైతే దానిని పరిగణిస్తుంది.
ఈ నెల 14కల్లా వాటాదారులుగా నమోదై రూ. 2 లక్షల విలువకు మించకుండా షేర్లు కలిగిన వాటాదారులకు ఇది వర్తించనుంది. చిన్న ఇన్వెస్టర్లకు 2:11, సాధారణ కేటగిరీలో 17:706 నిష్పత్తిని షేర్ల బైబ్యాక్‌కు నిర్ణయించింది. ఇన్ఫోసిస్‌లో 25,85,684 మంది చిన్న ఇన్వెస్టర్లున్నారు. అంటే రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద గల ప్రతీ 11 షేర్లలో 2 షేర్లకు బైబ్యాక్‌ను ఆఫర్ చేస్తుంది.
గత బైబ్యాక్‌ల తీరిలా
ఇన్ఫోసిస్ గతంలో తొలిసారి 2017లో రూ. 13,000 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. కంపెనీ ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు షేరుకి రూ. 1,150 ధరను నిర్ణయించింది. తదుపరి 2019లో రూ. 8,260 కోట్లు ఇందుకు వెచ్చించింది.
ఈ బాటలో మూడోసారి రూ. 9,200 కోట్లు, 2022లో మరోసారి షేరుకి రూ. 1,850 చొప్పున రూ. 9,300 కోట్లు చొప్పున బైబ్యాక్‌కు కేటాయించింది. కాగా.. ప్రస్తుత బై బ్యాక్‌లో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ పాల్గొనబోమని ఇప్పటికే ప్రకటించారు. ప్రమోటర్లలో నందన్ నిలేకని, సుధా మూర్తిసహా ఇతర ప్రమోటర్ కుటుంబీకులు ఇందుకు నో చెప్పడం గమనార్హం!


