ఆటోమొబైల్ ఔత్సాహికులు ఎంతో గానో ఎదురుచూస్తున్న కొత్త తరం టాటా సియెర్రా మార్కెట్‌లోకి వచ్చేసింది. రూ. 11.49 లక్షలు (పరిచయ ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద భారతదేశంలో సియెర్రా ఎస్‌యూవీని టాటా విడుదల చేసింది.
టాటా సియెర్రా ప్రధానంగా నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి వాహనాలను టాటా సంస్థ డెలివరీ చేయనుంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 158 బీహెచ్‌పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్బాక్సతో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 105 బీహెచ్‌పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీటీసీతో పొందే అవకాశం ఉంది.
అలాగే డీజిల్ 1.5-లీటర్ ఫోర్-పాట్ ఇంజన్ 116 బీహెచ్‌పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది. టాటా సియెర్రా ఏడబ్ల్యూడీతో వస్తోంది. అంటే ఇంజిన్ శక్తి నాలుగే చక్రాలకు ప్రసరిస్తుంది. తద్వారా అన్ని రకాల ఉపరితలాలపై వాహన వేగం, స్థిరత్వం, నియంత్రణ మెరుగ్గా ఉంటాయి. ఇలాంటి సాంకేతికతను పొందిన మొదటి టాటా మోడల్ ఇదే అవుతుంది.
సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.
వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది.
టాటా సియెర్రా డిజైన్‌కు సంబంధించిన ముఖ్యాంశాలలో బాక్సీ సిల్హౌట్, ఆల్పైన్ గ్లాస్ రూఫ్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫుల్-ఎల్ఈడి లైట్ ప్యాకేజీ, రియర్ స్పాయిలర్, సిగ్నేచర్ టాటా గ్రిల్ కొత్త వెర్షన్ ఉన్నాయి.


