జర్మనీ వాహన సంస్థ బీఎండబ్ల్యూ, మనదేశంలో గతేడాది రికార్డు స్థాయిలో కార్లు విక్రయించినట్లు తెలిపింది. 2025లో మొత్తం 18,001 కార్లను విక్రయించామని, ఇందులో 730 యూనిట్లు మినీ బ్రాండ్‌కు చెందినవని ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది(2024)15,723 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి 14% అధికం.
నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు, సులభతర ఫైనాన్సింగ్ అంశాలు విక్రయాలకు దన్నుగా నిలిచాయని కంపెనీ తెలిపింది. దేశీయ లగ్జరీ ఎలక్ట్రిక్ విభాగంలో అత్యధిక వాటా కలిగిన ఈ సంస్థ గతేడాదిలో 3,573 ఈవీ కార్లను విక్రయించింది.
గ్రూప్ మొత్తంగా 2025లో 23,842 వాహనాలను విక్రయించామని.. ఇందులో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల కార్లు 18,001 ఉండగా, బీఎండబ్ల్యూ మోటరాడ్ బైక్‌లు 5,841 ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్, బీఎండబ్ల్యూ మోటరాడ్ మూడు బ్రాండ్లలో కలిపి మొత్తం 20 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.
‘‘మునుపెన్నడూ లేనంతగా 2025లో 18,001 కార్లను విక్రయించి రికార్డు సృష్టించాము. వార్షిక ప్రాతిదికన అమ్మకాలు 14% వృద్ధి నమోదు కావడం లగ్జరీ కార్లపై కస్టమర్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ హర్మదీప్ సింగ్ బర్ తెలిపారు.


