భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్‌ను విస్తరించడంలో సహాయపడుతుంది. ఈ విషయాన్ని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా & సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో లగ్జరీ కార్ల మార్కెట్ కేవలం ఒక శాతం మాత్రమే. ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పదం ఈ అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉందని హర్దీప్ సింగ్ బ్రార్ పేర్కొన్నారు.
భారత్ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి గట్టి విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఇండియా కేవలం పెద్ద మార్కెట్ మాత్రమే కాదు.. సంస్కరణలు & భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్న విధానాలతో గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని హర్దీప్ సింగ్ తెలిపారు. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం పెరగడమే కాకుండా.. సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్స్ మార్పిడి మరింత బలపడుతుందని వివరించారు.
ప్రస్తుతం భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా వచ్చే కార్లపై భారీగా కస్టమ్స్ డ్యూటీలు ఉన్నాయి. ఇవి తగ్గితే.. వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని బ్రార్ అన్నారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ విక్రయాల్లో దిగుమతి వాటా ఐదు శాతం మాత్రమే ఉంది. ట్యాక్స్ తగ్గేదే ఈ వాటా పెరుగుతుందని అన్నారు.
ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు..
దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువైన అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.
ట్యాక్స్ తగ్గిస్తే.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్‌లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది.


