న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో విమాన ఇంధన ధరలు భగ్గుమన్న నేపథ్యంలో దేశీయంగా విమానయాన సంస్థలు టికెట్లపై అదనపు చార్జీలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా చార్జీలు పెంచేయగా, తాజాగా ఇండిగో కూడా అదే బాట పట్టింది. మార్చి 14 నుంచి (నేడు) దేశీ, విదేశీ రూట్లలో బుక్ చేసుకునే టికెట్లపై రూ. 425 నుంచి రూ. 2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తున్నట్లు వెల్లడించింది.
దేశీ రూట్లు, భారత ఉపఖండంలో తిరిగే ఫ్లయిట్లకు ఫ్యుయల్ చార్జ్ రూ. 425గా, పస్చిమాసియా సర్వి సులకు రూ. 900గా ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక ఆగ్నేయాసియా, చైనా, ఆఫ్రికా ఫ్లయిట్లకు రూ. 1,800గా, యూరప్ రూట్లలో రూ. 2,300గా చార్జీ ఉంటుంది. ఇప్పటికే ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ దేశీ రూట్లలో విధిస్తున్న రూ. 399 కన్నా ఇది అధికంగా ఉండటం గమనార్హం. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 40 శాతం ఉంటుంది.


