ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసే వారైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో లోన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. పర్సనల్ లోన్ & టాప్-అప్ లోన్లలో ఏది బెస్ట్. మీ సందేహానికి.. ఈ కథనమే సమాధానం.
పర్సనల్ లోన్
పర్సనల్ లోన్ గురించి దాదాపు అందరికీ తెలుసు. విద్య, పెళ్లి, వైద్య ఖర్చులు, ట్రావెల్ వంటి వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువమంది ఈ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోన్‌కు అప్రూవల్ ప్రక్రియ కొంత వేగంగా ఉంటుంది. అంతే కాకుండా డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా కొంత తక్కువే.
పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కూడా కొంత ఎక్కువే. మొత్తం మీద మీరు తీసుకున్న లోన్ మీద కొంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
టాప్ అప్ లోన్
టాప్ అప్ లోన్ విషయానికి వస్తే.. ఇది మీరు ఇప్పటికే తీసుకున్న లోన్‌పైనే అదనంగా ఇచ్చే లోన్ అన్నమాట. ఒక వ్యక్తి లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తున్న సమయంలో.. బ్యాంక్స్ లేదా ఫైనాన్స్ కంపెనీలు ఈ సౌకర్యాన్ని అందిస్తాయి.
టాప్ అప్ లోన్ తీసుకోవడం వల్ల.. వడ్డీ రేటు కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హోమ్ లోన్ మీద తీసుకునే టాప్-అప్ లోన్‌కు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఈఎంఐ కూడా పర్సనల్ లోన్‌తో పోలిస్తే చాలా తక్కువే. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. టాప్ అప్ లోన్ కావాలంటే.. మీరు ఇప్పటికే లోన్ తీసుకుని ఉండాలి. సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి.
పర్సనల్ లోన్ అనేది అత్యవసరంలో ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది. టాప్ అప్ లోన్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండదు. లోన్ తీసుకుని, సమయానికి చెల్లించేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి.. మీ సౌలభ్యం, అవసరాన్ని బట్టి.. ఏ లోన్ తీసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి.


