న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సరిహద్దు సంక్షోభం కారణంగా వాణిజ్య మార్గాలు మూసుకుపోవడంతో భారత్‌తో దోస్తీ కోసం ఆఫ్ఘనిస్తాన్ తహతహలాడుతోంది. ఆ దేశానికి చెందిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, దౌత్య సంబంధాలను విస్తరించాలని పిలుపునివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది. పాకిస్తాన్‌తో దౌత్య అంతరం పెరుగుతున్న తరుణంలో భారత్ పర్యటనకు వచ్చిన అజీజీ ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడారు.
భారతదేశంతో వ్యాపారానికి ఆఫ్ఘనిస్తాన్ తలుపులు తెరిచిందని ఈ సందర్భంగా అజీజీ అన్నారు. 2021 తర్వాత భారతదేశంలో తాజాగా మొదటి ఉన్నత స్థాయి తాలిబాన్ సమావేశం జరిగింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు ఏర్పడిన తరుణంలో ఆ దేశం నుంచి ఔషధాల దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారత పర్యటనలో ఉన్న అజీజీ..భారత్‌తో వాణిజ్యానికి కొత్త మార్గాలను కనుగొనడం, ఆర్థిక సహకారాన్ని పునరుద్ధరించడం తన పర్యటన ముఖ్య ఉద్దేశమని అన్నారు.
తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తమ అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్‌కు సబ్సిడీ ఇవ్వడం, ఇతర ప్రైవేట్ క్యారియర్‌లకు ప్రోత్సాహం అందించడం ద్వారా సరుకు రవాణా ఖర్చులను తగ్గించాలని యోచిస్తోంది. అంతేకాకుండా ఆఫ్ఘన్ డ్రై ఫ్రూట్స్, భారతీయ ఔషధాలతో సహా ఇరువైపులా ఎగుమతులను పెంచడానికి సుంకాలను తగ్గించాలని అనుకుంటోంది. పాకిస్తాన్‌కు ప్రత్యామ్నాయంగా ఇరాన్ ద్వారా సముద్ర మార్గాలు, ఆసియా ద్వారా భూ మార్గాలను వినియోగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. తమ దేశంలోని విస్తారమైన ఖనిజ నిక్షేపాలు, అరుదైన భూములపై భారతదేశం ఆసక్తి చూపుతున్నదని అజీజీ పేర్కొన్నారు.
భారతీయ కంపెనీలు ఆఫ్ఘన్ నిబంధనలను అనుసరించినంతవరకు వారికి తమ దేశంలో వాణిజ్యానికి సమాన అవకాశాలు ఇస్తామని అజీజీ హామీ నిచ్చారు. ఇటువంటి సానుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి త్వరలో ఆఫ్ఘనిస్తాన్.. భారత్‌కు ఒక వాణిజ్య ప్రతిపాదనను పంపుతుందని తెలిపారు. కాబూల్‌లోని భారత దౌత్యవేత్తలకు, రాయబార కార్యాలయానికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. భారత మహిళా వ్యవస్థాపకులకు ఆఫ్ఘనిస్తాన్‌లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా సహకారం అందిస్తామని అన్నారు. వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో ఆఫ్ఘనిస్తాన్‌ను సందర్శించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌లను ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అజీజీ ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: Delhi pollution: ఆఫీసులో ఫిఫ్టీ.. ఇంటిలో ఫిఫ్టీ!


