న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇవి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) లెవల్ త్రీ అమలు పరిధిలోనికి వస్తాయి. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా, ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఇకపై 50 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాలని ఆదేశించారు. మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులు గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఇంటి నుండి పని (వర్క్ ఫ్రమ్ హోం)చేయాలి.
సీఏక్యూఎం అనేది నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)నుండి డేటాను సమీకరిస్తుంది. సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ), వాతావరణ పరిస్థితుల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటుంది. గ్రాప్-3 పరిమితులనేవి ఏక్యూఐ 401 నుండి 450 మధ్య ఉన్నప్పుడు అమలులోకి వస్తాయి. దీని కంటే తీవ్రమైన స్థాయి అయిన ఏక్యూఐ 451 దాటినప్పుడు అత్యంత కఠినమైన గ్రాప్- 4 పరిమితులు విధిస్తారు. గాలి నాణ్యత చాలా తక్కువగా ఉన్నందున, చిన్నారులను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వకుండా ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు కొన్ని ఆంక్షలు ప్రకటించింది.
గ్రాప్-3 ఆంక్షలలో అత్యవసరం కాని నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం అమలులో ఉంటుంది. ఇందులో పునాది తవ్వడం, కందకాలు తవ్వడం, పైలింగ్, వెల్డింగ్, ప్లాస్టరింగ్, ఇసుక, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రవాణాపై కూడా ఆంక్షలు ఉన్నాయి. అలాగే బీఎస్ III పెట్రోల్, బీఎస్-IV డీజిల్ ఫోర్ వీలర్లను ఢిల్లీ, ఎన్‌సీఆర్ జిల్లాలలో నిషేధించారు.
ఈ చర్యలన్నిటి ఉద్దేశ్యం కాలుష్య స్థాయిలను తగ్గించి, ప్రజలను ప్రమాదకరమైన గాలి నుండి రక్షించడమే. ప్రభుత్వం ఈ కాలుష్య నివారణ చర్యలను 24 గంటల పర్యవేక్షణతో అమలు చేస్తున్నదని ఢిల్లీ పర్యావరణ మంత్రి తెలిపారు. గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రజలు సహకరించాలని కోరారు. వ్యర్థాలు, బయోమాస్‌లను బహిరంగంగా కాల్చడం మానుకోవాలని, దుమ్ము కాలుష్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఈ తరహా ఉల్లంఘనలు కనిపిస్తే గ్రీన్ ఢిల్లీ యాప్ ద్వారా నివేదించాలని ప్రభుత్వం పౌరులను కోరింది.
ఇది కూడా చదవండి: 25న అయోధ్యలో మరో ఉత్సవం.. ప్రధాని మోదీ హాజరు


