అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం.. నవంబరు 25(మంగళవారం)న మరో ముఖ్య ఘట్టానికి వేదిక కానుంది. ఆరోజున ఆలయ శిఖరంపై ధ్వజారోహణ (పవిత్ర జెండాను ఎగురవేసే) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి అయినందుకు గుర్తుగా జరిగే ఈ వేడుక కోసం ఆలయంతో పాటు పట్టణమంతా ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా శుభ ముహూర్తంలో పవిత్రమైన ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. మంగళవారం ఉదయం 11.52 నుండి మధ్యాహ్నం 12.35 గంటల మధ్య శుభ ముహూర్తంలో ఈ వేడుక జరగనుంది. ఇదే సమయంలో హెలికాప్టర్ల నుంచి ఆలయ శిఖరంపై పూలను జల్లేందుకు ఏర్పాట్లు చేశారు. 21 మంది వేద ఆచార్యులు, శంఖం పట్టిన స్వచ్ఛంద సేవకుల నడుమ ప్రధాని మోదీ ఈ పవిత్ర జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రధాని మోదీతో పాటు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
2024 జనవరిలో రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రధాన ఆలయ నిర్మాణ పనులు దశలవారీగా జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ఈ చారిత్రక వేడుకకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఏడువేల మంది అతిథులను ఆహ్వానించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బృందాలను ఆహ్వానించింది. అలాగే ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: దడ పుట్టించిన కాబూల్ విమానం


