రూ.30 కోట్ల విలువైన విగ్రహం అందించిన బెంగళూరు కళాకారిణి
యశ్వంతపుర : అయోధ్యలోని రామాలయానికి బంగారు రామయ్య విగ్రహాన్ని ఓ భక్తురాలు విరాళంగా అందించారు. రూ.30 కోట్ల విలువ చేసే 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కూడిన బంగారు, వజ్రాలతో కూడిన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని బెంగళూరు రాజాజీనగర్‌కు చెందిన కళాకారిణి జయశ్రీ ఫణీశ్ స్వయంగా రూపొందించి అందజేశారు. పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో విగ్రహాన్ని తీర్చిదిద్ది... విలువైన మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు, కెంపులతో అలంకరించారు.
తంజావూరు చిత్రకళ శైలిలో, బాలరాముని మూలవిరాట్టు పోలికలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శ్రీరాముని విగ్రహంలోనే హనుమాన్, గరుడ, దశావతార చిత్రాలున్నాయి. పెద్ద విల్లు, బాణాలు పట్టుకుని ఉన్న రామయ్య విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలోనే ప్రతిష్టించాలని రామజన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించారు.
జయశ్రీ ఫణీశ్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులు విగ్రహ ఖర్చును భరించినట్లు తెలిసింది. విగ్రహాన్ని నాణ్యమైన ఎర్రచందనం చెక్క పెట్టెలో ఆలయానికి మంగళవారం తీసుకెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణ రామయ్యకు ఆలయంలో విశేష పూజలు చేశారు.


