న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో ప్రధాన భద్రతా లోపం కారణంగా కాసేపు అలజడి చెలరేగింది. కాబూల్ నుండి వచ్చిన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎఫ్‌జీ 311 ల్యాండింగ్ కోసం కేటాయించిన రన్‌వేను కాకుండా, టేకాఫ్‌ల కోసం (బయలుదేరే విమానాల కోసం) ఉద్దేశించిన రన్‌వేపై పొరపాటున ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 12.06 గంటలకు జరిగిన ఈ సంఘటనలో, ఎయిర్‌బస్ ఏ310 విమానానికి రన్‌వే 29ఎల్‌లో ల్యాండింగ్‌కు అనుమతి లభించింది.
కాబూల్ విమానం అనుమతికి విరుద్ధంగా రన్‌వే 29ఆర్‌పై ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. రన్‌వే 29ఆర్ అనేది విమానాలు టేకాఫ్ కావడానికి మాత్రమే ఉపయోగించే రన్‌వే. ‘29ఆర్ నుండి విమానం టేకాఫ్ కావాల్సి ఉన్నందున ప్రమాదం చోటుచేసుకోలేదు. అదృష్టవశాత్తూ ఎఫ్‌జీ311 దానిపై ల్యాండ్ అయినప్పుడు బయలుదేరబోయే ఏ జెట్ కూడా రన్‌వేపై లేదు’ అని అధికారులు వెల్లడించారు.
ఆ సమయంలో 29ఆర్ నుండి ఏ విమానాలు టేకాఫ్ కాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ ఘటనపై విమానయాన అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనను తీవ్రమైన కార్యాచరణ ఉల్లంఘనగా పేర్కొంటూ, భారత అధికారులు అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్‌కు లేఖ రాయనున్నారు. ఢిల్లీ విమానాశ్రయ భద్రతా ప్రమాణాలను, అంతర్జాతీయ విమానయాన నియమాలను ఉల్లంఘించిన ఈ ఘటనపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై పాక్ ఉలికిపాటు


