న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శీతల గాలుల తీవ్రత మరింతగా పెరగడంతో చలి తన పంజా విసురుతోంది. ఈరోజు (గురువారం) ఉదయం నగరంలో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.1 డిగ్రీలు తక్కువ. హిమాలయ ప్రాంతాల నుండి వీస్తున్న అతి శీతల గాలుల వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ముందు డిసెంబర్ 20న 6.1 డిగ్రీలుగా నమోదయ్యింది. డిసెంబరు 31న 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తీవ్రమైన చలి వాతావరణం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని పాఠశాలలను జనవరి 15 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ వారం అంతటా ఇదే స్థాయి చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. శుక్రవారం నుండి గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ, జనవరి 14 వరకు ఉదయం పూట పొగమంచు ప్రభావం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఇటివంటి పరిస్థుతుల్లో ఢిల్లీవాసులకు వాయు కాలుష్యం నుండి కొంత ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం 336గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)గురువారం ఉదయానికి 276కి చేరి మెరుగుపడింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) వర్గీకరణ ప్రకారం 201-300 మధ్య ఏక్యూఐAQI ఉంటే దానిని ‘పూర్’ స్థాయిగా పరిగణిస్తారు. కాగా రానున్న రెండు రోజుల్లో ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలోనే కాకుండా జైపూర్, త్రిపుర, లక్నో, మీరట్ తదితర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన చలి గాలుల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం వేళల్లో ప్రయాణించే వారు పొగమంచు విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘తుర్క్‌మన్ గేట్’ అల్లర్లలో 30 మంది గుర్తింపు


