రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై పాక్‌ ఉలికిపాటు | Pakistan rattled by Rajnath Singhs Sindh remarks | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై పాక్‌ ఉలికిపాటు

Nov 24 2025 11:44 AM | Updated on Nov 24 2025 12:59 PM

Pakistan rattled by Rajnath Singhs Sindh remarks

ఇస్లామాబాద్: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ తీవ్రంగా స్పందించింది. సోమవారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. భవిష్యత్తులో సింధ్ భారతదేశానికి తిరిగి  చెందవచ్చంటూ రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు భ్రాంతితో కూడినవని, ఇది విస్తరణవాద, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. రాజ్‌నాథ్‌ సింగ్ మాటలు  హిందూత్వ విస్తరణవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యలు వాస్తవాలను సవాలు చేస్తున్నాయని, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 

రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన సింధ్ కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. సింధ్‌తో భారతదేశానికి ఉన్న శాశ్వత సాంస్కృతిక సంబంధాలపై దృష్టి సారించిన ఆయన, ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నప్పటికీ, దాని నాగరికత బంధం భారత్‌తో చెక్కుచెదరకుండా ఉందని అన్నారు. ‘నేడు, సింధ్ భూమి భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత ప్రకారం, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుంది’ అని అన్నారు. రాజకీయ సరిహద్దులు తాత్కాలికమే అయినప్పటికీ, సాంస్కృతిక గుర్తింపు, ఉమ్మడి వారసత్వం చాలా కాలం పాటు ఉంటాయని  రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.
 

రాజ్‌నాథ్‌ సింగ్ తన ప్రసంగంలో 1947 విభజన సమయంలో సింధ్‌ను కోల్పోవడంతో హిందువులు అనుభవించిన బాధను గుర్తు చేసుకున్నారు. సింధు నదిపై ఉన్న భక్తిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సింధు నదిని పవిత్రమైనదిగా భావించడం కేవలం హిందువులకే పరిమితం కాదని, సింధ్‌లోని పలువురు ముస్లింలు కూడా మక్కాలోని ఆబ్ ఎ జంజామ్ కంటే సింధు నది నీరు  ఎంతో పవిత్రమైనదని  నమ్ముతారన్నారు. 

ఇది కూడా చదవండి: పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement