పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్ ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం ఇక్కడి ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ)పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు, ఆత్మాహుతి బాంబర్లు దాడి చేయడంతో ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాయిటర్స్ నివేదికల ప్రకారం ఈ భీకర దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ఈ సమన్వయ దాడి అనంతరం భద్రతా దళాలు అప్రమత్తమై, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి.
దాడుల వెనుక ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని రాయటర్స్ పేర్కొంది. దాడి వ్యూహంలో భాగంగా తొలుత ఆత్మాహుతి బాంబర్ ప్రధాన కార్యాలయం ముఖద్వారంపై దాడి చేసి, తనను తాను పేల్చుకోగా, ఆ వెంటనే మరొక బాంబర్ దళాల దృష్టిని మళ్లించి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆవరణలోకి ప్రవేశించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ దాడి సమయంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయని, వెంటనే భారీగా కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు సోషల్ మీడియాలో వెల్లడించారు.
దాడి జరిగిన వెంటనే చట్ట అమలు సిబ్బంది, సైన్యం, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టారు. ప్రధాన కార్యాలయం లోపల ఇంకా కొందరు ఉగ్రవాదులు ఉండవచ్చని , పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా భద్రతా దళాలు ఘటన జరిగిన వెంటనే ఎఫ్‌సీ ప్రధాన కార్యాలయం వెలుపలి రహదారిని మూసివేసి, ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. పెషావర్‌లోని పారామిలిటరీ ప్రధాన స్థావరంపై జరిగిన ఈ ఆత్మాహుతి దాడి, దేశ భద్రతకు పెను సవాలుగా పరిణమించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్బంధ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఉగ్రవాదులను నిలువరించేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కారు దగ్ధానికి ఏసీ కారణమా? నిపుణులేమంటున్నారు?


