ఇటీవలి కాలంలో రోడ్లపై పలు కార్లు ఉన్నట్టుండి దగ్ఢం కావడాన్ని చూస్తున్నాం. దీనికి కారణాలు అనేకం ఉన్నా కారులోని ఏసీనే మంటలకు కారణమనే వాదన వినిపిస్తుంటుంది. అయితే ఇది ఎంతవరకూ నిజం? నిపుణులేమంటున్నారు? కారులోని ఏసీ వ్యవస్థ నేరుగా మంటలను సృష్టించకపోయినా, దానిలోని విద్యుత్, యాంత్రిక భాగాలు అధిక వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా మంటలు చెలరేగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన కారణం ఇదే..
కారులో మంటలు చెలరేగడానికి విద్యుత్ లోపాలు ప్రధాన కారణం. అలాగే కారు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ)వ్యవస్థలో ఏర్పడే సమస్యలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఏసీ కంప్రెషర్, బ్లోవర్ మోటార్ లేదా దాని కంట్రోల్ యూనిట్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు అరిగిపోవడం, కోసుకుపోవడం లేదా నాణ్యత లేని మరమ్మతుల కారణంగా షార్ట్ సర్క్యూట్‌లు ఏర్పడతాయి. ఫలితంగా సర్క్యూట్‌లో విద్యుత్ నిరోధకత హఠాత్తుగా తగ్గిపోయి, కరెంటు ప్రవాహం (Amperage) విపరీతంగా పెరుగుతుంది. ఈ అనూహ్యమైన విద్యుత్ పెరుగుదల వల్ల వైర్లు తీవ్రంగా వేడెక్కి (ఓవర్‌హీట్), వాటి ప్లాస్టిక్ ఇన్సులేషన్ మండుతుంది. దీంతో మంటలు క్షణాల్లో ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లోకి లేదా డ్యాష్‌బోర్డ్ లోపలికి వ్యాపిస్తాయి.
కంప్రెషర్ జామ్ అయినప్పుడు..
మంటలకు కారణమయ్యే మరో అంశం ఏసీ వ్యవస్థలోని విద్యుత్ భాగాలపై పడే ఓవర్‌లోడ్. ఉదాహరణకు బ్లోవర్ మోటార్ బేరింగ్‌లు పాతబడి లేదా మురికి వల్ల జామ్ అయినప్పుడు, అది మోటార్‌ను పనిచేయించడానికి ప్రయత్నిస్తూ సాధారణం కంటే ఎక్కువ కరెంటును వినియోగిస్తుంది. ఈ అధిక వినియోగం (ఓవర్‌లోడింగ్) వల్ల మోటార్ వైండింగ్‌లు, దాని ఫ్యూజ్ లేదా రిలే బాక్స్‌లోని కనెక్షన్లు తీవ్రంగా వేడెక్కుతాయి. అలాగే ఏసీ కంప్రెషర్ యాంత్రికంగా జామ్ అయినప్పుడు, దాని ఎలక్ట్రో-మ్యాగ్నెటిక్ క్లచ్‌పై అధిక ఒత్తిడి పడి, అది కూడా ఓవర్‌హీట్ అయ్యి మంటలకు దారితీయవచ్చు. ఇటువంటి సందర్భాల్లో సరైన సామర్థ్యం (Amperage) లేని ఫ్యూజులను వాడినా లేదా ఫ్యూజ్‌లను తీగలతో బైపాస్ చేసినా, విద్యుత్ లోపాన్ని అరికట్టే రక్షణ వ్యవస్థ పనిచేయక, మంటలు తక్షణమే చెలరేగే అవకాశం ఉంటుంది.
ముందస్తు సంకేతాలు
కారులోని ఏసీ వ్యవస్థ మంటల్లో చిక్కుకునే ముందు హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వాటిలో ముఖ్యమైనవి.. ప్లాస్టిక్ లేదా రబ్బరు కాలిపోయి తీవ్రమైన వాసన రావడం, ఏసీని ఆన్ చేసినప్పుడు ఫ్యూజులు పదేపదే కాలిపోవడం, డ్యాష్‌బోర్డ్ లేదా హుడ్ కింద నుండి పొగ రావడం జరుగుతుంటుంది. ఈ సంకేతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ఇటువంటి ప్రమాదాల నివారణకు కారు ఏసీ వ్యవస్థ వైరింగ్‌ను, ముఖ్యంగా కంప్రెషర్, బ్లోవర్ మోటార్ కనెక్షన్‌లను, అరిగిపోకుండా లేదా వదులు కాకుండా ఎప్పటికప్పుడు మెకానిక్‌తో తనిఖీ చేయించుకోవాలి. అధిక నాణ్యత గల విడి భాగాలను మాత్రమే ఉపయోగించాలి.
తక్షణం ఏం చేయాలి?
కారులో మంటలు లేదా పొగను గమనించిన వెంటనే సురక్షితమైన ప్రదేశంలో కారును ఆపి, ఇంజిన్‌ను వెంటనే ఆపివేయాలి, తద్వారా ఇంధనం, విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. కారులోని వారందరూ తక్షణమే కిందకు దిగి, కారు నుండి కనీసం 50 నుండి 100 అడుగుల దూరంలోకి వెళ్లిపోవాలి. వెంటనే అగ్నిమాపక విభాగానికి కాల్ చేసి సమాచారం అందించాలి. అయితే మంటలు చాలా చిన్నగా ఉన్నట్లయితే , మీ వద్ద సరైన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉన్నప్పుడు, హుడ్‌ను పూర్తిగా తెరవకుండా కొద్దిగా పైకి లేపి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ విలువైన వస్తువుల కోసం కారులోకి తిరిగి వెళ్లకూడదు. అలాగే విద్యుత్ లేదా ఇంధనం నుంచి వస్తున్న మంటలపై నీరు చల్లకూడదు. అగ్నిమాపక విభాగం వచ్చే వరకూ వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: అమెరికా హెచ్చరికలు.. వెనిజులాకు పలు దేశాల షాక్!


