వెల్‌కు వేస్తున్న బ్లోఅవుట్ ప్లగ్
ఎట్టకేలకు ఇరుసుమండలో వెల్‌కు ప్లగ్ మోరి–5 బావి మూసివేత
ఆరు రోజుల అనంతరం ఓఎన్‌జీసీ విజయం
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఈ నెల 5న సంభవించిన భారీ బ్లోఅవుట్ మంటలను శనివారం ఉదయం 10.30 గంటలకు పూర్తిస్థాయిలో అదుపు చేశారు. ఆరు రోజుల శ్రమ ఫలించడంతో ఓఎన్‌జీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున మంటలు బాగా తగ్గడంతో నీరు చల్లుతూ సిబ్బంది వెల్ మౌత్ వద్దకు వెళ్లారు.
పరిస్థితిని అధ్యయనం చేసి దెబ్బతిన్న భాగాలను తొలగించి.. బ్లోఅవుట్ ప్లగ్‌ను ప్రత్యేక క్రేన్‌తో వెల్‌కు అమర్చడంతో గ్యాస్ మంటలు పైకి వెళ్లడం ప్రారంభమైంది. అనంతరం ప్లగ్ ద్వారా గ్యాస్ లీకేజీని అదుపుచేశారు. దీంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. అనంతరం విజయోత్సవాలు నిర్వహించుకున్న ఓఎన్‌జీసీ అధికారులు, సిబ్బంది, రెస్క్యూ టీమ్ స్వీట్లు పంచుకున్నారు. అనంతరం 12 గంటలకు వెల్ మూసివేత చర్యలలో భాగంగా ప్రత్యేక యంత్రాల ద్వారా బావిలోకి మడ్ పంపింగ్ ప్రక్రియ ప్రారంభించారు.
ఇది సమష్టి విజయం
ఇరుసుమండ బ్లోఅవుట్‌ను ఆరు రోజులు శ్రమించి సమష్టి కృషితో అదుపు చేశాం. సిబ్బంది, రెస్క్యూ టీమ్ అహర్నిశలూ శ్రమించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా పూర్తిస్థాయిలో సహకరించారు. ప్రస్తుతానికి బ్లోఅవుట్ ప్లగ్ వేసి మూసేశాం. వెల్‌ను కూడా మడ్‌తో మూసివేశాం. తరువాత చర్యలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. – శంతన్‌దాస్, ఓఎన్‌జీసీ ఈడీ–కం–అసెట్ మేనేజర్, రాజమహేంద్రవరం
త్వరితగతిన మూసివేశాం
బ్లోఅవుట్ మంటలను చాలా తక్కువ సమయంలోనే కంట్రోల్ చేశాం. ఓఎన్‌జీసీకి సంబంధించిన సిబ్బంది సాంకేతికతతో పనిచేశారు. ఘటన సంభవించిన నాటినుంచి ఈ రోజు వరకూ అలుపెరగకుండా పని చేశాం. – గాజుల శ్రీహరి, ఇన్‌చార్జి, క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్


