సాక్షి, అంబేద్కర్ కోనసీమ: ఇరుసుమండలంలో నాలుగు రోజుల క్రితం సంభవించిన ఓఎన్‌జీసీ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి ఆంబ్రెల్లా ఆపరేషన్ చేపట్టడంతో పాటు గ్యాస్ సామర్థ్యం తగ్గడంతో అగ్నికీలల తీవ్రత తగ్గింది. దీంతో అక్కడికి ఉన్న ఓఎన్‌జీసీ సిబ్బంది కాలిన వ్యర్థాలను తొలిగించారు. మంటలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
జనవరి 5న అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలంలో ఓఎన్జీసీ మోరి బావి5లో భారీ బ్లోఅవుట సంభవించింది. ఓఎన్జీసీ సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ ఎగజిమ్మింది. దీంతో పెద్దఎత్తున 100 మీటర్ల పైకి మంటలు లేశాయి. అగ్నికీలల తీవ్రత చూసి బెంబేలెత్తిపోయిన రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.
అగ్నిప్రమాదం జరిగిన మోరి-5 నంబర్ బావి ఓఎన్‌జీసీ మోరి స్ట్రక్చర్ పరిధిలో ఉంది. భద్రతాకారణాలు సరిగ్గా లేకపోవడంతో 12 ఏళ్లక్రితమే దీనిని మూసివేశారు. ఈ బావిని తెరిస్తే బ్లోఅవుట్ తప్పదని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించడంతో దీని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. కాగా ప్రస్తుతం మళ్లీ అక్కడే పనులు ప్రారంభించడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


