- డ్రిల్లింగ్ చేస్తుండగా ఎగదన్నుకు వచ్చిన గ్యాస్
- రెండు గంటల తరువాత భారీ విస్ఫోటనం
- ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీసిన స్థానికులు
- పగటి వేళ కావడంతో రెండు గ్రామాల ప్రజలకు తప్పిన ప్రాణాపాయం
- గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు
- ప్రమాదం జరిగే బావిగా గుర్తించి 12 ఏళ్ల కిందట మూసివేత
- తాజాగా.. గుజరాత్‌కు చెందిన డీప్ సీ సంస్థకు డ్రిల్లింగ్ బాధ్యతలు
- భయపడినట్లుగానే సంభవించిన బ్లోఅవుట్
- ఓఎన్‌జీసీపై మండిపడుతున్న స్థానికులు
- కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ప్రమాదం
సాక్షి, అమలాపురం/మలికిపురం: పచ్చని కోనసీమ గుండెలపై చమురు సంస్థలు మరో కుంపటి రాజేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీకి చెందిన మోరి–5వ నెంబరు బావి వద్ద ఒక్కసారిగా బ్లోఅవుట్ సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. ఇరుసుమండ గ్రామం వద్ద ఉన్న బావిలో నెలరోజులుగా గుజరాత్‌కు చెందిన డీప్ సీ ఇండస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో.. సోమవారం ఉ.11 గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా సహజ వాయువు (గ్యాస్) ఒక్కసారిగా పైకి ఎగదన్నుకు వచ్చింది. తొలుత ఆ ప్రాంతమంతా గ్యాస్ ఎగజిమ్మగా తరువాత మంటలు చెలరేగాయి. చెవులు చిల్లులు పడే శబ్దంతో గ్యాస్ ఎగదన్నడం.. మంటలు చెలరేగడంతో సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని దశాబ్ద కాలం కిందట మూసివేసిన ఈ బావి వద్దే ఇప్పుడు మళ్లీ పనులు చేపట్టడం, బ్లోఅవుట్ (Blow Out) సంభవించడంతో చమురు సంస్థలపై స్థానికులు మండిపడుతున్నారు.

భారీ శబ్దాలతో పొగలా విస్తరించిన గ్యాస్..
దీనిని అదుపు చేసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు విఫలం కావడం... రానురానూ తీవ్ర పీడనంతో గ్యాస్ బయటకు ఎగదన్నుకు వస్తుండడంతో సిబ్బంది రిగ్గును వదిలి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో రిగ్ వద్ద పదిమంది వరకూ సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ గ్యాస్ ఎగదన్నుకు వస్తూనే ఉంది. ఆ సమయంలో భారీ శబ్దాలు రావడం, గ్యాస్ తెల్లని పొగలా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం చూసి, సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
వృద్ధులు, చిన్న పిల్లలను చంకన వేసుకుని తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. డ్రిల్ సైటుకు సమీపంలో నాట్లు వేస్తున్న కూలీలు పేలుడు ధాటికి పొలాల్లోనే భయంతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికి తేరుకుని, అక్కడి నుంచి పరుగు తీశారు. రెండు గంటల పాటు గ్యాస్ ఎగజిమ్మడంతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఇరుసుమండతో పాటు లక్కవరం (Lakkavaram) గ్రామస్తులను ఖాళీ చేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ వినియోగించవద్దని, నిప్పు రాజేయవద్దని మైకుల్లో ప్రచారం చేశారు.
మంటలు చెలరేగి భారీ విస్ఫోటనం..
డ్రిల్లింగ్ చేస్తున్న బావి నుంచి గ్యాస్ ఎగదన్నుకు వచ్చిన సమయంలో పెద్ద హోరు వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిప్పు రాజుకోవడంతో మంటలు చెలరేగి, ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. దీంతో.. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన తొలిగంటలో 100 మీటర్ల ఎత్తున మంటలు ఎగసిపడి ఆ తర్వాత 300 మీటర్ల మేర అగ్నికీలలు విస్తరించాయి. మ.3 గంటల సమయంలో గ్యాస్‌తో పాటు బావి నుంచి చమురు కూడా వస్తుండడంతో మంటలు పైకి ఎగసిపడటం తగ్గినా అవి దిగువ భాగంలో విస్తరించాయి. భారీ ఒత్తిడితో గ్యాస్ ఎగదన్నుతోంది. దీని ఒత్తిడి ఎంత అనేది నిపుణులు ఇంకా అంచనా వేయలేకపోతున్నారు.
మండిందా? మండించారా!?..
తాజాగా.. ఇరుసుమండ బ్లోఅవుట్ (Irusumanda blow out) సంఘటన వెనుక కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉ.11 గంటలకు బావి నుంచి ఎగజిమ్మిన గ్యాస్ మధ్యాహ్నానికి గ్రామమంతటా వ్యాపించింది. గ్యాస్ మరింత విరజిమ్మి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తే 2014లో ‘నగరం’లో చోటుచేసుకున్న ఘటన తరహా విస్ఫోటనం జరుగుతుందని ఓఎన్‌జీసీ సిబ్బంది, అధికారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ ఇంకా భారీగా వ్యాపిస్తే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భావించడంతో దానిని మండించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
పగటి వేళ ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే కనుక రాత్రివేళ జరిగి ఉంటే గ్యాస్ వ్యాపించి విద్యుద్దీపాలు, ఇతర మండే వస్తువులవల్ల రెండు గ్రామాలు తుడిచిపెట్టుకు పోయేవని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనికితోడు ప్రస్తుతం మంచు కురుస్తుండడంతో గ్యాస్ పొరలు పొరలుగా కమ్ముకుని ప్రమాద తీవ్రత పెరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
కలెక్టర్, ఎస్పీ పరిశీలన..
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్‌కుమార్ మీనా, డీఆర్‌ఓ కె.మాధవి, అమలాపురం ఎంపీ గంటి హరీష్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. బ్లోఅవుట్‌కు దారితీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రిస్క్ అని తెలిసి కూడా..
ప్రమాదం సంభవించిన మోరి–5వ నంబర్ బావి ఓఎన్‌జీసీ మోరి స్ట్రక్చర్ పరిధిలో ఉంది. 12 ఏళ్ల క్రితం దీనిని మూసివేశారు. అప్పటికి దాదాపు పన్నెండేళ్లపాటు ఈ బావి నుంచి గ్యాస్, చమురు వెలికితీశారు. అనంతరం వట్టిపోవడంతో దీనిని మూసివేశారు. తరువాత చమురు నిక్షేపాల కోసం చేపట్టిన సిస్మిక్ సర్వేల్లో దీనికి సమీపంగా ప్రత్యేక జోన్లను గుర్తించారు. ఇదే సైట్ వద్ద కొత్త జోన్‌ను గుర్తించి, ఇక్కడ అపార చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయని నిర్ధారించారు. అయితే, ప్రొడక్షన్ టెస్టింగ్‌లో డ్రిల్లింగ్ సంస్థకు షాక్ తగిలింది. గ్యాస్ కిక్‌లు (బ్లోఅవుట్ సంకేతాలు) ప్రారంభం కావడంతో అప్పట్లోనే ముంబై, గుజరాత్‌ల నుంచి నిపుణులు వచ్చారు.
ప్రత్యేక పరికరాలు తెచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ బావిని మూసివేయడం తప్ప వేరే మార్గంలేదని చేతులెత్తేశారు. ఈ బావిని తెరిస్తే బ్లోఅవుట్ తప్పదని ఆ నిపుణులు చెప్పడంతో పూర్తిగా మూసివేశారు. ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని అప్పట్లోనే ‘సాక్షి’ కూడా కథనాలు అందించింది. తాజాగా.. ఈ బావిని ప్రైవేట్ సంస్థకు అప్పగించి తెరవాలని అధికారులు నిర్ణయించడానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


