విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి
అనంతపురం నుంచి జిల్లా స్థాయి నిరసనలు
అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహాధర్నా
ఇది మంచి ప్రభుత్వం కాదు.. ఉద్యోగులను ముంచిన ప్రభుత్వం
అన్ని వర్గాల ఉద్యోగులూ నష్టపోయారు
రూ.40 వేల కోట్ల ఉద్యోగుల బకాయిలు ఇస్తారో లేదో తెలీదు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా మార్చారు
ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ఫైర్
సాక్షి, అమరావతి : ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు.
ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కేటగిరీ ఉద్యోగులకు కూడా మంచి జరగలేదని, ఇచి్చన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని, అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. \
రెండేళ్లయినా ఐఆర్ ఊసేలేదు..
ఉద్యోగులను దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోకపోవడంవల్లే విజయవాడ ధర్నాచౌక్ ఉద్యోగుల ధర్నాలతో దద్దరిల్లుతోందన్నారు. ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలని చెప్పారని.. దానితో ఎన్ని పండుగలు చేసుకోవాలని ఆయన ప్రశి్నంచారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆర్నెల్లకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారని.. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత పెండింగ్ పెట్టారని తెలిపారు. అలాగే, ఐఆర్ వెంటనే ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. కానీ, రెండేళ్లయినా దాని గురించి మాట్లాడడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే చెప్పిన మాట మేరకు ఐఆర్ ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే ఇప్పటివరకూ కొత్త కమిషనర్‌ను నియమించలేదని, ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశి్నంచారు.
ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలు..
ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ ఉన్నాయని.. వాటిని ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో కూడా తెలీడంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పోలీసులకు ఐదు ఎస్‌ఎల్‌లు పెండింగ్‌లో ఉన్నాయని.. సీపీఎస్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపించకపోగా కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడంలేదని.. ఉద్యోగులకు కనీసం పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు.
అర్హతలేని వ్యక్తిని సెక్రటరీ జనరల్‌గా నియమించి అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయని, రాజుల కాలంలో బానిసల కంటే దారుణంగా వారితో పనిచేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 80 మంది ఉద్యోగులు చనిపోయారని.. అయినా వారిపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడంలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు.


