breaking news
gas leackage
-
అగ్నిజ్వాల... శబ్దఘోష!
కోనసీమ గడ్డపై మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం ఉదయం మోరి–5వ నంబర్ బావి వద్ద బీభత్సమైన శబ్దంతో బ్లోఅవుట్ ఉబికి, గ్యాస్ ఎగదన్నుతూ భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో పడ్డారు. మంగళవారం మధ్యాహ్నానికి బ్లోఅవుట్ తీవ్రత తగ్గినా మరికొన్ని రోజులు ఇది కొనసాగుతుందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్న మాట. సహజ వాయువు వెలికితీత కోసం ఇనుప గొట్టాలతో డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు రాతిపొర తగిలితే ఆ గొట్టం ద్వారా బాంబింగ్ జరపడం అలవాటు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా సహజ వాయువు పెల్లుబికి ప్రమాదానికి దారితీస్తుంది. ఇది మొదటిసారేమీ కాదు. చిన్నవో, పెద్దవో ఇలాంటి ఉదంతాలు అడపా దడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 1993లో కొమరాడలో తొలిసారి ప్రమాదం జరగ్గా 1995 జనవరిలో పాశర్లపూడి 19ఏ బావిలో డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ సంభవించి 65 రోజులపాటు కోనసీమను హడలెత్తించింది. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైపులైన్ పగిలి గ్యాస్ విడుదలై 22 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నవే కావొచ్చుగానీ... అటుతర్వాత కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ ప్రస్తుత ఉదంతంతో సహా దాదాపు అన్నీ జనం అప్రమత్తంగా ఉన్న వేళ సంభవించినవే. కానీ ఆదమరిచి నిద్రిస్తున్నవేళ జరిగితే జనం ప్రాణాలు ఏం కావాలి? మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్క సారిగా సహజ వాయువు ఎగదన్నిందనీ, ఆకాశాన్నంటేలా మంటలు వ్యాపించాయనీ మీడియా కథనం. క్షణాల్లో ఆ ప్రాంతంలో గ్యాస్ అలుముకోవటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లోనివారు ఇళ్లకు తాళాలేసి ప్రాణభయంతో పిల్లాపాపల్ని తీసుకుని పరుగులు పెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులొచ్చినా ఓఎన్జీసీ సిబ్బంది మాత్రం గంటన్నర తర్వాతగానీ రాలేదని జనం చెబుతున్నారు. తరచు సమస్యలెదురవుతున్నా, ప్రమాదం జరిగే ప్రాంతాలు జనావాసాలకు దగ్గరగా ఉంటున్నా ఏటా వేలకోట్ల రూపాయల విలువైన చమురు, సహజ వాయువులను తోడేస్తున్న సంస్థలు భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం తీసుకోవాల్సిన వరస చర్యలేమిటో సిబ్బందికి కనీస అవగాహన ఉందా? అక్కడి నుంచి మాయంకావటం తప్ప ఇంకేమీ తెలియదా? వెంటనే ఎవరెవరికి సమాచారం అందించాలో, నిపుణులైనవారు అనుసరించాల్సిన విధివిధానా లేమిటో రూపొందాయా? అవసరమైన ఉపకరణాలేమైనా అక్కడ అందుబాటులో ఉన్నాయా? జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)ను ఈ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలకు సమీపంగా ఉంచారా? స్థానికులకు ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇచ్చే వ్యవస్థలుండాలి. గోప్యత పాటిస్తే అనవసర వదంతులు వ్యాపిస్తాయి. ఒకప్పుడు ఓఎన్జీసీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలన్నీ సాగేవి. ఇప్పుడు ప్రైవేటు సంస్థల ప్రమేయం పెరిగింది. చేసేది ఎవరైనా నిర్లక్ష్యం సహించరానిది. కోనసీమ గర్భంలో అపురూపమైన సహజ వనరులు నిక్షిప్తమై ఉన్నాయని తెలిశాక స్థానికులు సంతోషించారు. ఉద్యోగావకాశాలతోపాటు, అభివృద్ధి పనులు కూడా చకచకా మొదలవుతాయని ఆశించారు. కానీ జరిగిందంతా వేరు. అంతంతమాత్రంగా ఉన్న రహదారులు భారీ వాహనాల రాకతో దెబ్బతిన్నాయి. సున్నితమైన పర్యావరణం కొంచెం కొంచెంగా దెబ్బతింటూ కొబ్బరి, వరి దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్న మాట. చమురు, గ్యాస్ వెలికితీశాక ఆ ఖాళీలోకి సముద్ర జలాల ఊట చేరి బావుల్లో నీరు ఉప్పగా మారిందంటున్నారు. జల, వాయు కాలుష్యాలు ప్రజారోగ్యంపై కలగజేస్తున్న ప్రభావం ఏమిటో ప్రభుత్వాలు ఆరా తీసినట్టు లేదు. తెలంగాణలోని సింగరేణిలో తవ్వే బొగ్గుపై వచ్చే ఆదాయంలో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికిస్తుండగా చమురు, సహజవాయువుల నుంచి లభించే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్నదెంత? కోనసీమకు దక్కుతున్నదేమిటి? ఈ బ్లోఅవుట్ చల్లారిన తర్వాతైనా ప్రభుత్వమూ, ప్రజాప్రతినిధులూ దీనిపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకుండా చూడాలి. -
ONGC Gas Leak: మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఫైర్ ఫైటర్స్
-
కోనసీమలో భారీ బ్లో అవుట్
సాక్షి, అమలాపురం/మలికిపురం: పచ్చని కోనసీమ గుండెలపై చమురు సంస్థలు మరో కుంపటి రాజేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీకి చెందిన మోరి–5వ నెంబరు బావి వద్ద ఒక్కసారిగా బ్లోఅవుట్ సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. ఇరుసుమండ గ్రామం వద్ద ఉన్న బావిలో నెలరోజులుగా గుజరాత్‌కు చెందిన డీప్ సీ ఇండస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ జరుగుతోంది.ఈ నేపథ్యంలో.. సోమవారం ఉ.11 గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా సహజ వాయువు (గ్యాస్) ఒక్కసారిగా పైకి ఎగదన్నుకు వచ్చింది. తొలుత ఆ ప్రాంతమంతా గ్యాస్ ఎగజిమ్మగా తరువాత మంటలు చెలరేగాయి. చెవులు చిల్లులు పడే శబ్దంతో గ్యాస్ ఎగదన్నడం.. మంటలు చెలరేగడంతో సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని దశాబ్ద కాలం కిందట మూసివేసిన ఈ బావి వద్దే ఇప్పుడు మళ్లీ పనులు చేపట్టడం, బ్లోఅవుట్ (Blow Out) సంభవించడంతో చమురు సంస్థలపై స్థానికులు మండిపడుతున్నారు. భారీ శబ్దాలతో పొగలా విస్తరించిన గ్యాస్.. దీనిని అదుపు చేసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు విఫలం కావడం... రానురానూ తీవ్ర పీడనంతో గ్యాస్ బయటకు ఎగదన్నుకు వస్తుండడంతో సిబ్బంది రిగ్గును వదిలి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో రిగ్ వద్ద పదిమంది వరకూ సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ గ్యాస్ ఎగదన్నుకు వస్తూనే ఉంది. ఆ సమయంలో భారీ శబ్దాలు రావడం, గ్యాస్ తెల్లని పొగలా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం చూసి, సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.వృద్ధులు, చిన్న పిల్లలను చంకన వేసుకుని తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. డ్రిల్ సైటుకు సమీపంలో నాట్లు వేస్తున్న కూలీలు పేలుడు ధాటికి పొలాల్లోనే భయంతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికి తేరుకుని, అక్కడి నుంచి పరుగు తీశారు. రెండు గంటల పాటు గ్యాస్ ఎగజిమ్మడంతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఇరుసుమండతో పాటు లక్కవరం (Lakkavaram) గ్రామస్తులను ఖాళీ చేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ వినియోగించవద్దని, నిప్పు రాజేయవద్దని మైకుల్లో ప్రచారం చేశారు. మంటలు చెలరేగి భారీ విస్ఫోటనం.. డ్రిల్లింగ్ చేస్తున్న బావి నుంచి గ్యాస్ ఎగదన్నుకు వచ్చిన సమయంలో పెద్ద హోరు వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిప్పు రాజుకోవడంతో మంటలు చెలరేగి, ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. దీంతో.. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన తొలిగంటలో 100 మీటర్ల ఎత్తున మంటలు ఎగసిపడి ఆ తర్వాత 300 మీటర్ల మేర అగ్నికీలలు విస్తరించాయి. మ.3 గంటల సమయంలో గ్యాస్‌తో పాటు బావి నుంచి చమురు కూడా వస్తుండడంతో మంటలు పైకి ఎగసిపడటం తగ్గినా అవి దిగువ భాగంలో విస్తరించాయి. భారీ ఒత్తిడితో గ్యాస్ ఎగదన్నుతోంది. దీని ఒత్తిడి ఎంత అనేది నిపుణులు ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. మండిందా? మండించారా!?.. తాజాగా.. ఇరుసుమండ బ్లోఅవుట్ (Irusumanda blow out) సంఘటన వెనుక కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉ.11 గంటలకు బావి నుంచి ఎగజిమ్మిన గ్యాస్ మధ్యాహ్నానికి గ్రామమంతటా వ్యాపించింది. గ్యాస్ మరింత విరజిమ్మి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తే 2014లో ‘నగరం’లో చోటుచేసుకున్న ఘటన తరహా విస్ఫోటనం జరుగుతుందని ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ ఇంకా భారీగా వ్యాపిస్తే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భావించడంతో దానిని మండించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.పగటి వేళ ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే కనుక రాత్రివేళ జరిగి ఉంటే గ్యాస్ వ్యాపించి విద్యుద్దీపాలు, ఇతర మండే వస్తువులవల్ల రెండు గ్రామాలు తుడిచిపెట్టుకు పోయేవని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనికితోడు ప్రస్తుతం మంచు కురుస్తుండడంతో గ్యాస్ పొరలు పొరలుగా కమ్ముకుని ప్రమాద తీవ్రత పెరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్‌కుమార్ మీనా, డీఆర్ఓ కె.మాధవి, అమలాపురం ఎంపీ గంటి హరీష్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. బ్లోఅవుట్‌కు దారితీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.రిస్క్ అని తెలిసి కూడా..ప్రమాదం సంభవించిన మోరి–5వ నంబర్ బావి ఓఎన్జీసీ మోరి స్ట్రక్చర్ పరిధిలో ఉంది. 12 ఏళ్ల క్రితం దీనిని మూసివేశారు. అప్పటికి దాదాపు పన్నెండేళ్లపాటు ఈ బావి నుంచి గ్యాస్, చమురు వెలికితీశారు. అనంతరం వట్టిపోవడంతో దీనిని మూసివేశారు. తరువాత చమురు నిక్షేపాల కోసం చేపట్టిన సిస్మిక్ సర్వేల్లో దీనికి సమీపంగా ప్రత్యేక జోన్లను గుర్తించారు. ఇదే సైట్ వద్ద కొత్త జోన్‌ను గుర్తించి, ఇక్కడ అపార చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయని నిర్ధారించారు. అయితే, ప్రొడక్షన్ టెస్టింగ్‌లో డ్రిల్లింగ్ సంస్థకు షాక్ తగిలింది. గ్యాస్ కిక్‌లు (బ్లోఅవుట్ సంకేతాలు) ప్రారంభం కావడంతో అప్పట్లోనే ముంబై, గుజరాత్ల నుంచి నిపుణులు వచ్చారు.ప్రత్యేక పరికరాలు తెచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ బావిని మూసివేయడం తప్ప వేరే మార్గంలేదని చేతులెత్తేశారు. ఈ బావిని తెరిస్తే బ్లోఅవుట్ తప్పదని ఆ నిపుణులు చెప్పడంతో పూర్తిగా మూసివేశారు. ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని అప్పట్లోనే ‘సాక్షి’ కూడా కథనాలు అందించింది. తాజాగా.. ఈ బావిని ప్రైవేట్ సంస్థకు అప్పగించి తెరవాలని అధికారులు నిర్ణయించడానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కోనసీమలో భారీగా గ్యాస్ లీక్..!
మలికిపురం: మరోసారి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల్ని ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఇరుసుముండలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైంది. గ్యాస్ తీవ్రతతో మంటలు వంద అడుగుల మేర ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి విధులు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. మంటలు వ్యాపిస్తుండడంతో ఇరుసుముండ గ్రామాన్ని దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ధాటికి వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి బూడిదయ్యాయి. గ్యాస్లీకేజీపై సమాచారం అందుకున్న సమీప గ్రామాల ప్రజలు సైతం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మలికిపురం మండలం ఇరుసమండ వద్ద భారీగా గ్యాస్ లీకేజ్ అవుతుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ఇది మరొక బ్లో అవుట్‌కు దారి తీస్తుందేమోనని భయం గుప్పెట్లో ఉన్నారు కోనసీమ వాసులు. గతంలో పాశర్లపూడి వద్ద చోటు చేసుకున్న ఘటనను తలుచుకుంటున్నారు. ఈ గ్యాస్ లీక్ తొందరగా అదుపులోకి వస్తే ఫర్లేదు కానీ ఒకవేళ తీవ్రతరమైతే మరొకసారి తామ తీవ్ర ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. -
మొన్న తల్లిదండ్రులు.. నిన్న కుమారుడు.. అనాథగా మారిన కూతురు!
హైదరాబాద్: ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో మూడ్రోజుల క్రితం వంట గ్యాస్ లీకై దంపతులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో నివసించే మిర్యాల రమేష్.. ఇంట్లోని వంట గ్యాస్ లీకై న విషయాన్ని గ్రహించకుండా.. కరెంటు స్విచ్ వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యారు. అదే రోజు రమేష్ మృతి చెందాడు. మరుసటి రోజు ఆయన భార్య శ్రీలత ఆస్పత్రిలో కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన కుమారుడు హర్షవర్ధన్ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనతో వడ్డెర బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడు మృతి చెందడంతో చెల్లెలు అనాథగా మారింది. ప్రస్తుతం ఈ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
సిలిండర్ లీకేజీతో మంటలు
కందుకూరు (రంగారెడ్డి జిల్లా): వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఇంట్లో వస్తువులు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని లేమూరు పరిధిలో దన్నారం రవీందర్ ఇంట్లో ఆయన భార్య శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో వంట చేయడానికి లైటర్‌తో గ్యాస్ స్టవ్‌ను వెలిగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గ్యాస్ లీకై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని వారు బయటకు పరుగెత్తారు. భార్యభర్తలతో పాటు వారి ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. కాగా, గ్రామస్తులు స్పందించి మంటలను ఆర్పి సిలిండర్ నుంచి రెగ్యులేటర్‌ను తొలగించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.


