మలికిపురం: మరోసారి కోనసీమ జిల్లా వాసుల్ని ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఇరుసుముండలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైంది. గ్యాస్ తీవ్రతతో మంటలు వంద అడుగుల మేర ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి విధులు నిర్వహిస్తున్న ఓఎన్‌జీసీ సిబ్బంది పరుగులు తీశారు. మంటలు వ్యాపిస్తుండడంతో ఇరుసుముండ గ్రామాన్ని దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ధాటికి వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి బూడిదయ్యాయి. గ్యాస్‌లీకేజీపై సమాచారం అందుకున్న సమీప గ్రామాల ప్రజలు సైతం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.
కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మలికిపురం మండలం ఇరుసమండ వద్ద భారీగా గ్యాస్ లీకేజ్ అవుతుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ఇది మరొక బ్లో అవుట్‌కు దారి తీస్తుందేమోనని భయం గుప్పెట్లో ఉన్నారు కోనసీమ వాసులు. గతంలో పాశర్లపూడి వద్ద చోటు చేసుకున్న ఘటనను తలుచుకుంటున్నారు. ఈ గ్యాస్ లీక్ తొందరగా అదుపులోకి వస్తే ఫర్లేదు కానీ ఒకవేళ తీవ్రతరమైతే మరొకసారి తామ తీవ్ర ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.



