కోనసీమ గడ్డపై మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం ఉదయం మోరి–5వ నంబర్ బావి వద్ద బీభత్సమైన శబ్దంతో బ్లోఅవుట్ ఉబికి, గ్యాస్ ఎగదన్నుతూ భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో పడ్డారు. మంగళవారం మధ్యాహ్నానికి బ్లోఅవుట్ తీవ్రత తగ్గినా మరికొన్ని రోజులు ఇది కొనసాగుతుందని ఓఎన్‌జీసీ అధికారులు చెబుతున్న మాట. సహజ వాయువు వెలికితీత కోసం ఇనుప గొట్టాలతో డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు రాతిపొర తగిలితే ఆ గొట్టం ద్వారా బాంబింగ్ జరపడం అలవాటు.
ఆ క్రమంలోనే ఒక్కసారిగా సహజ వాయువు పెల్లుబికి ప్రమాదానికి దారితీస్తుంది. ఇది మొదటిసారేమీ కాదు. చిన్నవో, పెద్దవో ఇలాంటి ఉదంతాలు అడపా దడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 1993లో కొమరాడలో తొలిసారి ప్రమాదం జరగ్గా 1995 జనవరిలో పాశర్లపూడి 19ఏ బావిలో డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ సంభవించి 65 రోజులపాటు కోనసీమను హడలెత్తించింది. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైపులైన్ పగిలి గ్యాస్ విడుదలై 22 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నవే కావొచ్చుగానీ... అటుతర్వాత కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
అదృష్టవశాత్తూ ప్రస్తుత ఉదంతంతో సహా దాదాపు అన్నీ జనం అప్రమత్తంగా ఉన్న వేళ సంభవించినవే. కానీ ఆదమరిచి నిద్రిస్తున్నవేళ జరిగితే జనం ప్రాణాలు ఏం కావాలి? మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్క సారిగా సహజ వాయువు ఎగదన్నిందనీ, ఆకాశాన్నంటేలా మంటలు వ్యాపించాయనీ మీడియా కథనం. క్షణాల్లో ఆ ప్రాంతంలో గ్యాస్ అలుముకోవటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లోనివారు ఇళ్లకు తాళాలేసి ప్రాణభయంతో పిల్లాపాపల్ని తీసుకుని పరుగులు పెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులొచ్చినా ఓఎన్‌జీసీ సిబ్బంది మాత్రం గంటన్నర తర్వాతగానీ రాలేదని జనం చెబుతున్నారు.
తరచు సమస్యలెదురవుతున్నా, ప్రమాదం జరిగే ప్రాంతాలు జనావాసాలకు దగ్గరగా ఉంటున్నా ఏటా వేలకోట్ల రూపాయల విలువైన చమురు, సహజ వాయువులను తోడేస్తున్న సంస్థలు భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం తీసుకోవాల్సిన వరస చర్యలేమిటో సిబ్బందికి కనీస అవగాహన ఉందా? అక్కడి నుంచి మాయంకావటం తప్ప ఇంకేమీ తెలియదా? వెంటనే ఎవరెవరికి సమాచారం అందించాలో, నిపుణులైనవారు అనుసరించాల్సిన విధివిధానా లేమిటో రూపొందాయా? అవసరమైన ఉపకరణాలేమైనా అక్కడ అందుబాటులో ఉన్నాయా? జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్)ను ఈ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలకు సమీపంగా ఉంచారా? స్థానికులకు ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇచ్చే వ్యవస్థలుండాలి. గోప్యత పాటిస్తే అనవసర వదంతులు వ్యాపిస్తాయి. ఒకప్పుడు ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలన్నీ సాగేవి. ఇప్పుడు ప్రైవేటు సంస్థల ప్రమేయం పెరిగింది. చేసేది ఎవరైనా నిర్లక్ష్యం సహించరానిది.

కోనసీమ గర్భంలో అపురూపమైన సహజ వనరులు నిక్షిప్తమై ఉన్నాయని తెలిశాక స్థానికులు సంతోషించారు. ఉద్యోగావకాశాలతోపాటు, అభివృద్ధి పనులు కూడా చకచకా మొదలవుతాయని ఆశించారు. కానీ జరిగిందంతా వేరు. అంతంతమాత్రంగా ఉన్న రహదారులు భారీ వాహనాల రాకతో దెబ్బతిన్నాయి. సున్నితమైన పర్యావరణం కొంచెం కొంచెంగా దెబ్బతింటూ కొబ్బరి, వరి దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్న మాట. చమురు, గ్యాస్ వెలికితీశాక ఆ ఖాళీలోకి సముద్ర జలాల ఊట చేరి బావుల్లో నీరు ఉప్పగా మారిందంటున్నారు.
జల, వాయు కాలుష్యాలు ప్రజారోగ్యంపై కలగజేస్తున్న ప్రభావం ఏమిటో ప్రభుత్వాలు ఆరా తీసినట్టు లేదు. తెలంగాణలోని సింగరేణిలో తవ్వే బొగ్గుపై వచ్చే ఆదాయంలో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికిస్తుండగా చమురు, సహజవాయువుల నుంచి లభించే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్నదెంత? కోనసీమకు దక్కుతున్నదేమిటి? ఈ బ్లోఅవుట్ చల్లారిన తర్వాతైనా ప్రభుత్వమూ, ప్రజాప్రతినిధులూ దీనిపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకుండా చూడాలి.


