ఈ రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదు | JAC Amaravati State Chairman Bopparaju Venkateswarlu Fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఈ రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదు

Mar 15 2026 5:59 AM | Updated on Mar 15 2026 5:59 AM

JAC Amaravati State Chairman Bopparaju Venkateswarlu Fires on Chandrababu Govt

పీఆర్‌సీ దూరమవుతుందనే ఆందోళన అందరిలో ఉంది 

మా ఓపిక ఉద్యోగులు అవకాశం ఇచ్చినంత వరకే.. 

జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

అనంతపురం అర్బన్‌ :  ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్‌సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్‌ను ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ, రెండేళ్లవుతున్నా ఐఆర్‌ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల ఊసేలేదు. సరెండర్‌ లీవులు పెండింగ్‌.. డీఏలు పెండింగ్‌. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది.

ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచి్చనంత వరకే. ఆ తరువాత చెప్పలేం’.. అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్‌రావు, మైనుద్దీన్, కార్యదర్శి సోమశేఖర్‌ తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు.. 
ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు., ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ త్వరలో ఇస్తామని గత ఏడాది అక్టోబరు 18న ముఖ్యమంత్రి  స్పష్టమైన హామీ ఇచ్చారని.. అయితే, ఐదారు నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలుకాలేదని బొప్పరాజు అన్నారు. దీంతో పీఆర్‌సీ దూరం చేస్తారనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. జాప్యం చేయకుండా పీఆర్‌సీ కమిషనర్‌ను తక్షణం నియమించాలన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. తక్షణం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లకు పైగా బకాయిల ఊసేలేదని అన్నారు. సరెండర్‌ లీవులు ఇవ్వలేదని, డీఏలూ పెండింగ్‌ పెట్టారన్నారు. పోలీసులకు ఒక్క సరెండర్‌ లీవును రెండు విడతలుగా ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. 

పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయి.. 
ఇక పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లు ఉన్నాయని బొప్పరాజు చెప్పారు. బెనిఫిట్లు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని.. కానీ, అవి తీసుకోకుండానే రిటైర్డ్‌ ఉద్యోగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా తాము సహకరిస్తున్నామని, అదే స్థాయిలో ప్రభుత్వం సహకరించడంలేదని బొప్పరాజు చెప్పారు.

ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. గత సంక్రాంతి పండుగకు ఇచ్చామంటున్న డీఏ ఇంత వరకు చాలా మందికి అందలేదు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం రెమ్యూనరేషన్‌ ఇవ్వడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి యమలోకంలో ఉన్నట్లు ఉంది. 30 ఏళ్ల పిల్లలు కూడా గుండె నొప్పి, బ్రెయిన్‌ స్ట్రోక్‌లతో చనిపోతున్నారు.     – బాజీ పఠాన్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

ఏ సమస్యా పరిష్కారం కాలేదు
ఉపాధ్యాయుల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. వాటి కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కూటమి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఆందోళనలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఐఆర్‌ గురించి పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలు అలాగే ఉన్నాయి. పెన్షన్‌ కార్పొరేషన్‌ హామీ ఏమైందో తెలీదు.      – రఘునాథ్‌రెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ)

త్వరలో ఆందోళన ఉధృతం
ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా జీతం కింద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ వంటి వాటిని కూడా మాకు ఇవ్వడంలేదు. పీఆర్సీ, ఐఆర్‌ గురించి అసలు ప్రస్తావనే చేయకపోవడాన్ని బట్టి అవి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. ఉపాధ్యాయులను ప్రతి చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారు. లోపభూయిష్టమైన అసెస్మెంట్‌ రిజిస్టర్లతో ఇబ్బంది పెడుతున్నారు. త్వరలో ఉధృతంగా ఆందోళన తప్పదు. –   ఏఎం గిరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement