పచ్చి అబద్ధాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు సర్కారు
కాగ్, ఆర్‌బీఐ గణాంకాల ప్రకారమే రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్ అప్పు.. బాబు సర్కారు ఇచ్చిన గ్యారెంటీ అప్పులు రూ.1.51 లక్షల కోట్లు
రెండూ కలిపి 22 నెలల్లో చేసిన అప్పులు మొత్తంగా రూ.3.33 లక్షల కోట్లు.. ఇందుకు కాగ్ గణాంకాలు, ప్రభుత్వ జీవోలే ప్రత్యక్ష సాక్ష్యం
అయినా తమ అప్పులు 1.05 లక్షల కోట్లేనన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
కాగ్ గణాంకాలను, వారిచ్చిన జీవోలనే సదరు మంత్రి తప్పు పడతారా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం తన అప్పులపై కూడా పచ్చి అబద్ధాలు చెబుతోంది. ఒక పక్క చంద్రబాబు సర్కారు 22 నెలల పాలనలో బడ్జెట్ అప్పులు ఎంత చేశారనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో పాటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వాస్తవాలను బహిరంగంగా వెల్లడించినా, బాబు సర్కారు మాత్రం బొంకడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా కాగ్ గణాంకాలను, ఆర్‌బీఐ లెక్కలను కాదని అవాస్తవాలు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్ అప్పులు చేసినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాకుండా, బాబు తొలి ఆర్థిక ఏడాది పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయిందని, అప్పు చేయనిదే రోజు గడవడం లేదని ఇదే ఆర్థిక మంత్రికి ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక మొట్టికాయలు వేసింది.
ఏడాదిలో అప్పు చేయకుండా గడిచిన రోజులు కేవలం 8 మాత్రమేనని, మిగతా 357 రోజులు అప్పులు చేయనిదే గడవ లేదని ఆ నివేదిక వెల్లడించింది. బాబు సర్కారు తొలి ఏడాది చేసిన అప్పులతో భవిష్యత్ అభివృద్ధి అంధకారమేనని వ్యాఖ్యానించింది. ఇదే విషయాలను ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీన్ని జీర్ణించుకోలేని ఆర్థిక మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలతో ఎదురు దాడికి దిగారు. చంద్రబాబు సర్కారు 22 నెలల్లోనే బడ్జెట్ అప్పులు రూ.1.82 లక్షల కోట్లు చేసినట్లు కాగ్ నివేదికతో పాటు ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇందుకు కాగ్ నివేదికలు, ఆర్‌బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చిన అప్పుల గణాంకాలు సాక్ష్యంగా నిలిచాయి.
కాగ్ కడిగి పారేసినా మారని వైఖరి
⇒ 2024–25 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు సర్కారు బడ్జెట్ అప్పు రూ.81,597 కోట్లు చేసినట్లు కాగ్ గణాంకాలు బహిరంగంగా వెల్లడించాయి. ఈ గణాంకాలు కాగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నాటికి బడ్జెట్‌లో రూ.1,00,667 కోట్లు అప్పు చేసినట్లు కాగ్‌తో పాటు ఆర్‌బీఐ
గణాంకాలు స్పష్టం చేశాయి.
⇒ ఈ అప్పులకు సంబంధించి గణాంకాలు కాగ్ వెబ్‌సైట్‌తో పాటు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. చంద్రబాబు సర్కారు 22 నెలల్లో బడ్జెట్ అప్పులు రూ.1,82,264 కోట్లు చేసినట్లు కాగ్, ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా ఆర్థిక మంత్రి కేశవ్ మాత్రం బాబు ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు కేవలం రూ.1.05 లక్షల కోట్లేనని చెప్పడం ఎవరిని మోసం చేయడానికని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి బాబు సర్కారు గ్యారెంటీ అప్పులు
అప్పులకు ఆధారమైన సర్కారు జీవోలు 
⇒ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పయ్యావుల కేశవ్ రాజ్యాంగ బద్ధమైన కాగ్, ఆర్‌బీఐ గణాంకాలను తప్పుగా పేర్కొనడం గమనార్హం. బడ్జెట్ బయట చంద్రబాబు సర్కారు 22 నెలల్లోనే వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో ఎడాపెడా అప్పులు చేసింది. ఇందుకు చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీవోలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ జీవోల గురించి మంత్రి కేశవ్‌కు తెలియదా? 

⇒ రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1,51,057 కోట్ల అప్పులు చేయడానికి పలు జీవోలు జారీ చేశారు. ఈ జీవోలన్నీ తప్పని ఆర్థిక మంత్రి కేశవ్ చెప్పగలరా? మరి బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట కలిపి బాబు సర్కారు చేసిన అప్పులు రూ.3,33,321 కోట్లకు చేరాయి. వాస్తవాలు ఇలా ఉంటే మంత్రి కేశవ్ అప్పులపై ఉద్దేశ పూర్వకంగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 

బాబు మెప్పు కోసం మంత్రి కేశవ్ అబద్ధాలు
⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై కూడా ఆర్థిక మంత్రి కేశవ్ పచ్చి అబద్ధాలు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి రూ.6.32 లక్షల కోట్లేనని ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో ఇదే ఆర్థిక మంత్రి కేశవ్ లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు. 2023–24 మార్చి 31 నాటికి వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పు రూ.4,91,734 కోట్లు, బడ్జెట్ బయట అప్పు రూ.1,40,470 కోట్లు అని సమాధానమిచ్చారు. ఈ రెండు కలిపితే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి మొత్తం అప్పు రూ.6,32,204 కోట్లేనని తెలిపారు. 

⇒ ఈ వాస్తవాలు ఇలా ఉండగా, ఇదే మంత్రి కేశవ్ వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.9 లక్షల కోట్ల అప్పులు చేసిందని మీడియాకు ఎలా చెబుతారు? అంటే మండలిలో చెప్పిన అంకెలు తప్పా? లేదా మీడియాతో చెప్పిన అంకెలు తప్పా? ఏది సరైందో కేశవ్ చెప్పాలి. మండలిలో తప్పుడు లెక్కలు చెప్పలేక వాస్తవాలు చెప్పి.. మీడియాలో మాత్రం తప్పుడు లెక్కలు చెప్పినట్లు స్పష్టం అవుతోంది. చట్టసభల్లో ఒకలాగ, మీడియాతో మరోలా మాట్లాడుతూ సదరు మంత్రి తన పరువు తానే తీసుకుంటూ చంద్రబాబు మెప్పు కోసం తహతహలాడుతున్నారనేది స్పష్టం అవుతోంది. 



