కారకాస్: వెనిజులాలో భద్రతా పరిస్థితులు మరింతగా దిగజారడానికి తోడు, ఆ దేశ గగనతలంలో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరగడంతో, ప్రపంచంలోని పలు ప్రధాన విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను వెనిజులాకు నిరవధికంగా రద్దు చేశాయి. యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఇటీవల పైలట్‌లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. దేశంలో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో, అలాగే అన్ని ఎత్తులలో విమానాలకు బెదిరింపులు ఎదురయ్యే అవకాశాలున్నాయని దానిలో పేర్కొంది.
ఒంటరిని చేసి..
ఈ పరిణామాల దరిమిలా వెనిజులాలోని ఎయిర్‌లైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపిన వివరాల ప్రకారం, టీఏపీ, ఎల్‌ఏటీఏఎం, ఏవియాంకా, ఇబెరియా, గోల్, కరేబియన్ తదితర ఆరు ప్రధాన క్యారియర్‌లు ఇప్పటికే తమ విమానాలను నిలిపివేశాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్ కూడా తాత్కాలికంగా నవంబర్ 24 నుండి 28 వరకు తమ సర్వీసులను రద్దు చేసింది. ఈ సంక్షోభం ప్రధానంగా ట్రంప్ పరిపాలనా విభాగం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచడంతో ఏర్పడింది. మదురోను దక్షిణ అమెరికా దేశానికి చట్టబద్ధమైన నాయకునిగా అమెరికా పరిగణించడం లేదు. దీనిలో భాగంగానే అమెరికా సైన్యం వెనిజులా తీరం వరకు బాంబర్ విమానాలను మోహరించింది. విమానాల రద్దుపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు. వెనిజులాకు అంతర్జాతీయ అనుసంధానాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. ఈ చర్యలు తమ దేశానికి అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని పెంచుతాయని, తద్వారా సామాన్య పౌరులు ఇబ్బందులు పడతారని పెట్రో అభిప్రాయపడ్డారు.
వెనిజులాతో వివాదానికి కారణం ఇదే..
అమెరికా- వెనిజులా మధ్య ఘర్షణ ప్రధానంగా నికోలస్ మదురో నాయకత్వం చుట్టూ తిరుగుతోంది. 2018 ఎన్నికల ఫలితాలను అమెరికా అంగీకరించకపోవడానికి తోడు ప్రతిపక్ష నేత జువాన్ గైడోకు మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. మదురో ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘనలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు చేస్తూ, అమెరికా ఆ దేశంలోని చమురు రంగంతో సహా పలు కీలక రంగాలపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు వెనిజులా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికితోడు అమెరికా.. కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలను, బాంబర్ విమానాలను మోహరించి, సైనిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఉద్రిక్తతతలకు తొడు గగనతలంలో భద్రతపై అమెరికా జారీ చేసిన హెచ్చరికల కారణంగానే అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెనిజులాకు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. అమెరికా మదురోను అధికారంలో నుండి తొలగించేందుకు యోచిస్తుండగా, మదురో తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపధ్యంలో వెనిజులా ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: మోగిన ప్రమాద ఘంటికలు.. ఉదయాన్నే ఆగిన ఊపిరి


