న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈరోజు (సోమవారం) ఉదయం గాలి నాణ్యత (ఏక్యూఐ)కనిష్ట స్థాయికి క్షీణించింది. రాజధాని నగరమే కాకుండా దాని పొరుగు ప్రాంతాలు కూడా తీవ్రమైన కాలుష్య వర్గం అంచునకు చేరాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీలో సగటు ఏక్యూఐ 397 వద్ద ఉంది. ఇది తీవ్ర వర్గానికి చేరుకునేందుకు కొద్ది దూరంలోనే ఉంది. ఢిల్లీ మహానగరంలోని 39 పర్యవేక్షణ కేంద్రాలలో 20 కేంద్రాలు ఇప్పటికే తీవ్రమైన కాలుష్యాన్ని నమోదు చేశాయి. రోహిణి (458), జహంగీర్‌పురి (455), ఆనంద్ విహార్ (442) తదితర ప్రాంతాలు వాయు కాలుష్యానికి హాట్‌స్పాట్‌లుగా నిలిచాయి.
ఢిల్లీలోని అత్యధిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న దృష్ట్యా.. ప్రజారోగ్యం ప్రమాదంలో పడినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది.ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నోయిడా ఏక్యూఐ 413కు చేరి, తీవ్రమైన (Severe) వర్గంలోకి చేరింది. ఘజియాబాద్‌లో 432 ఏక్యూఐ నమోదై అత్యంత విషపూరితమైన గాలి తాండవిస్తోంది. ఈ ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలు ఆదివారం నాటి నివేదికలతో పోలిస్తే మరింత క్షీణించించాయనే విషయం స్పష్టమవుతోంది. గ్రేటర్ నోయిదాలో 399 ఏక్యూఐ నమోదయ్యింది. ఇది తీవ్ర కాలుష్య స్థాయిని సూచిస్తోంది.
కాగా గురుగ్రామ్ (291), ఫరీదాబాద్ (239)లలో కాలి నాణ్యత పేలవమైన (Poor) కేటగిరీలో ఉంటూ, తమ పొరుగున ఉన్న ప్రాంతాల కంటే కొంత మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య పలువురు నిరసనకారులు ఇండియా గేట్ వద్ద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే వారిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు పోలీసులు వారిపై చిల్లీ స్ప్రేను ఉపయోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిరసనను నిర్వహించిన ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్.. ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
గాలి నాణ్యత స్థిరంగా తీవ్రమైన వర్గంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం కాలుష్యానికి కారణాలను పరిష్కరించడంలో విఫలమైందని వారు ఆరోపించారు. నీటి స్ప్రింక్లర్లు, క్లౌడ్ సీడింగ్ లాంటి దీర్ఘకాలిక, పరిష్కారం లేని విధానాలను అమలు చేస్తోందని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: చలి చంపేస్తోంది.. అక్కడ ‘0’ డిగ్రీలు


