సాక్షి, ఢిల్లీ: వీధి కుక్కల కేసు విచారణ ఇవాళ ఎటు నుంచి ఎటో పోయింది. ఈ కేసు విచారణ సందర్భంగా గురువారం సుప్రీం కోర్టులో పిల్లుల ప్రస్తావన కూడా వచ్చింది. అలాగే వీధుల్లోని అన్ని కుక్కలను తరలించమని తాము ఆదేశించలేదని.. కేవలం సంస్థలు, కార్యాలయాల నుండి మాత్రమే తరలించమన్నామని స్పష్టం చేసింది.
జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. ‘‘కుక్కలను పెంచుకునే కంటే పిల్లుల్ని పెంచుకోండి. ఎలుకల్ని నియంత్రించడంలో పిల్లులు సహాయ పడుతాయి. కాబట్టి కుక్కలను పెంచే కంటే పిల్లులను పెంచుకోవడానికి ప్రోత్సహించాలి’’ అని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అలాగే.. వీధి కుక్కల తొలగింపు విషయంలో నియమాలను పాటించాల్సిందేనని మరోమారు స్పష్టం చేసింది.
విచారణలో భాగంగా.. పట్టణాల్లో జంతువుల నియంత్రణ అంశంపై వాదిస్తూ సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్(యానిమల వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ తరఫున) కుక్కల అంశంతో పాటు ఎలుకలు, పిల్లుల గురించి ప్రస్తావించారు. కుక్కలు లేకపోతే ఎలుకలు, కోతుల సమస్య పెరుగుతుందని వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సందీప్ మెహతా.. కుక్కలు, పిల్లులు పరస్పరం శత్రువులు. పిల్లులు, ఎలుకలు బద్ధ శత్రువులు. వీధుల్లో కుక్కల సంఖ్య తగ్గితే.. పిల్లుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడవి ఎలుకలను తింటాయి కదా” అని జస్టిస్ మెహతా సరదాగా వ్యాఖ్యానించారు.
వీధి కుక్కల దాడుల వ్యవహారంలో సుప్రీం కోర్టు సుమోటో విచారణ కొనసాగుతోంది. సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ వాదిస్తూ.. ఏబీసీ (Animal Birth Control) నియమాలు అమలు చేయడం.. స్టెరిలైజేషన్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టడం.. సరైందని వాదించారు. పెద్ద సంఖ్యలో కుక్కలను షెల్టర్లలో ఉంచితే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు.
సీనియర్ అడ్వకేట్ కృష్ణన్ వేణుగోపాల్ వాదిస్తూ.. దేశవ్యాప్తంగా ABC అమలు చేయడానికి రూ.1,600 కోట్లు అవసరమని, ఐదు మంత్రిత్వ శాఖలు కలసి పని చేయాలని సూచించారు. అయితే.. ప్రస్తుతం కేవలం 66 ABC కేంద్రాలు మాత్రమే ఉన్నాయని.. దేశవ్యాప్తంగా 5.2 కోట్ల వీధికుక్కలన్నాయనే అంచనాలున్నాయని, అదే సమయంలో వెటర్నరీ డాక్టర్లకు పెద్ద స్థాయిలో శిక్షణ అవసరమని పేర్కొన్నారు.
బీజేపీ నేత విజయ్ గోయల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ABC నియమాలు కుక్కల జనాభాను తగ్గించడానికి రూపొందించబడ్డాయని చెప్పారు. హింసాత్మక కుక్క(violent dog) అనే పదానికి నిర్వచనం స్పష్టంగా లేదని, ఢిల్లీలో ఒకే కుక్క వరుసగా ముగ్గురిని కరిచిన ఉదాహరణను చూపించారు. తమ హెల్ప్‌లైన్‌కు ఇప్పటివరకు 20,000 పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
కోర్టు ఆందోళన
దేశవ్యాప్తంగా కుక్కల దాడులు పెరుగుతున్నాయి అని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. - మున్సిపల్ సంస్థలు, స్థానిక సంస్థలు ABC నియమాలను సరిగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొంది. వీధుల్లో జంతువుల ఉనికి రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతోందని గమనించినట్లు తెలిపింది. తదుపరి వాదనలు రేపు కూడా జరగనున్నాయి.


