న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోతున్నాయి. చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంపై చలిగాలుల ప్రభావం అధికంగా ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో చలి, పొగమంచు విపరీతంగా ఉంది.
రాజస్థాన్‌లోని 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోగా, మౌంట్ అబూలో బుధవారం ‘సున్నా’ డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాత్రిపూట మంచు విపరీతంగా కురుస్తోంది. ఫతేపూర్, నాగౌర్, సికార్, దౌసా వంటి ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అస్సాం, మేఘాలయ, బిహార్, తూర్పు యూపీ, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో మోస్తరు నుండి తేలికపాటి పొగమంచు కనిపించింది. వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉత్తరాఖండ్‌లో ఎత్తయిన ప్రాంతాలలో చలి తీవ్రంగా పెరిగింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు రెండూ హిమపాతంతో మూసుకుపోయాయి. గత అక్టోబర్ 23న ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్‌నాథ్‌లో అత్యధిక హిమపాతం కురిసింది. బద్రీనాథ్‌లో కూడా ఉష్ణోగ్రతలు కనిష్టంగా తగ్గాయి. రాబోయే 48 గంటల్లో ఉత్తరాఖండ్‌తో సహా హిమాలయ ప్రాంతాలలో హిమపాతం తో పాటు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కేరళ, తమిళనాడులలో తేలికపాటి వర్షాలు కురిశాయి. అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం, లక్షద్వీప్‌లలో కూడా తేలికపాటి వర్షం కురిసింది. కర్ణాటక దక్షిణ తీరంలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.


