ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. క్యాష్ రిచ్ లీగ్‌లోని ఫ్రాంఛైజీలు తమ జట్లను పటిష్ట పరచుకునే క్రమంలో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి.. ఒక రకంగా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి. ఐపీఎల్-2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.
రూ. 14.20 కోట్లు
అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు అయిన కార్తిక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer)లపై చెరో రూ. 14.20 కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్ టీ20 లీగ్‌లో వీరిద్దరు నయా సెన్సేషన్లుగా నిలిచారు. ఇద్దరిదీ మధ్య తరగతి కుటుంబమే. తల్లిదండ్రుల త్యాగాలతోనే ఆటగాళ్లుగా ఎదిగిన కార్తిక్, ప్రశాంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా చరిత్ర సృష్టించారు.
వీరిద్దరిలో కార్తిక్ శర్మ కుటుంబం ఒకానొక దశలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని అతడి కుటుంబమే స్వయంగా IANSకు తెలిపింది. పందొమ్మిదేళ్ల కార్తిక్ స్వస్థలం రాజస్తాన్‌లోని భరత్‌పూర్. అతడి తల్లిదండ్రులు మనోజ్ శర్మ, రాధ. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం.
అయితే, కుమారుడిని క్రికెటర్ చేయాలన్నది కార్తిక్ తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అతడి తల్లి రాధ కొడుకు ఏదో ఒకరోజు కచ్చితంగా ఆటగాడిగా ఎదుగుతాడని బలంగా నమ్మేవారు. అందుకోసం భర్తతో కలిసి ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయం గురించి కార్తిక్ తండ్రి మనోజ్ శర్మ మాటల్లోనే..
నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు
‘‘మా ఆదాయం అంతంతమాత్రమే. అయితే, నా భార్య రాధకు మాత్రం ఓ కల ఉండేది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కార్తిక్‌ను క్రికెటర్ చేయాలని ఆమె అంటూ ఉండేది. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. మా కుమారుడు క్రికెటర్ అయితే చాలు అనుకునేది.
కార్తిక్ శిక్షణ కోసం మేము మాకున్న చిన్నపాటి ప్లాట్లు, బరేనా గ్రామంలో మాకున్న పొలం అమ్మేశాము. రాధ తన నగలు కూడా అమ్మేసింది. మా జీవితాల్లో అదొక అత్యంత కఠినమైన దశ. అయితే, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం కార్తిక్‌పై పడకుండా మేము చూసుకున్నాము.
గ్వాలియర్‌లో టోర్నమెంట్ ఆడేందుకు కార్తిక్‌ను నేను అక్కడికి తీసుకువెళ్లాను. నాలుగైదు మ్యాచ్‌లలోనే జట్టు ఇంటిబాట పడుతుందని అనుకున్నాము. అయితే, కార్తిక్ ప్రదర్శన కారణంగా జట్టు ఫైనల్ చేరింది. అయితే, ఆ మ్యాచ్ అయ్యేంత వరకు గ్వాలియర్‌లోనే ఉండేందుకు మా దగ్గర సరిపడా డబ్బు లేదు.
ఖాళీ కడుపుతోనే
అప్పుడు మేము ఓ నైట్ షెల్టర్‌లో ఉన్నాము. తినడానికి ఏమీ లేదు. ఖాళీ కడుపుతోనే ఆరోజు నిద్రపోయాము. తర్వాత ఫైనల్లో మ్యాచ్ గెలిచిన తర్వాత కార్తిక్‌కు వచ్చిన ప్రైజ్‌మనీతోనే మేము తిరిగి ఇంటికి చేరుకోగలిగాము’’ అని తాము పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.
అదే విధంగా.. ‘‘రెండున్నరేళ్ల వయసులోనే నా కుమారుడు బ్యాట్‌తో బంతిని బాది రెండు ఫొటోఫ్రేములను పగులగొట్టాడు. అది మాకెంతో ప్రత్యేకం. ఆరోజే మేము తన భవిష్యత్తు గురించి ఓ అంచనాకు వచ్చేశాము. నిజానికి క్రికెటర్ కావాలని నేనూ కలగన్నాను. అయితే, నా కోరిక తీరలేదు. నా కుమారుడి రూపంలో ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని మనోజ్ శర్మ తెలిపారు.
చదువునూ కొనసాగిస్తా
కాగా దేశీ క్రికెట్‌లో సత్తా చాటిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ కోసం వేలంలో గట్టి పోటీ ఎదురైనా చెన్నై మాత్రం అతడిని వదల్లేదు. భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన కార్తిక్.. క్రికెట్‌తో పాటు చదువునూ కొనసాగిస్తానని చెబుతున్నాడు. ఇక కార్తిక్ పెద్ద తమ్ముడు చదువుపైనే ఎక్కువగా దృష్టి పెట్టగా.. చిన్న తమ్ముడు మాత్రం క్రికెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
సంకల్పం బలంగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరవచ్చని ఇప్పటికే ఎంతో మంది యువ క్రీడాకారులు నిరూపించారు. ఇప్పుడీ జాబితాలో కార్తిక్ శర్మ కూడా చేరాడు. తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలంగా.. టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసే ఐపీఎల్‌కు అతడు సెలక్ట్ అయ్యాడు. చెన్నై వంటి చాంపియన్ జట్టు అతడిని ఏరికోరి కొనుక్కోవడం అతడి ప్రతిభకు నిదర్శనం.
చదవండి: IND vs SA: 'ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణయంతో షాకయ్యాను'


