న్యూజిలాండ్ స్టార్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వెస్టిండీస్‌తో గురువారం మొదలైన మూడో టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించారు.
డబ్ల్యూటీసీ (WTC) 2025-27లో భాగంగా కివీస్ జట్టు స్వదేశంలో విండీస్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. అసాధారణ పోరాటంతో వెస్టిండీస్ తొలి టెస్టు డ్రా చేసుకోగా.. రెండో టెస్టులో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం ‘బే ఓవల్’ వేదికగా మూడో టెస్టు మొదలైంది.
ఓపెనింగ్ జోడీగా వచ్చి.. శతకాలతో చెలరేగి
టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్.. పర్యాటక విండీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనింగ్ జోడీగా వచ్చిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham), డెవాన్ కాన్వే సెంచరీలతో చెలరేగారు. లాథమ్ 246 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 137 పరుగులు చేసి.. రోచ్ బౌలింగ్‌లో రోస్టన్ చేజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
మరోవైపు.. తొలిరోజు ఆట ముగిసే సరికి కాన్వే 279 బంతుల్లో 178 పరుగులతో (25 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నైట్ వాచ్‌మన్ జేకబ్ డఫీ (Jacob Duffy) 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫలితంగా గురువారం నాటి మొదటిరోజు ఆటలో న్యూజిలాండ్ 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 334 పరుగులు సాధించింది.
ప్రపంచ రికార్డు
ఇదిలా ఉంటే.. తొలి వికెట్‌కు లాథమ్, కాన్వే కలిసి 520 బంతుల్లో ఏకంగా 323 పరుగులు జతచేశారు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కు 317 పరుగులు జోడించగా.. లాథమ్- కాన్వే తాజాగా ఈ రికార్డును సవరించారు.
అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ సాధించిన జోడీగానూ లాథమ్- కాన్వే చరిత్రకెక్కారు. గతంలో ఈ రికార్డు చార్లెస్ స్టెవర్ట్ డెంప్‌స్టర్- జాన్ ఎర్నెస్ట్ మిల్స్ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్‌పై 1930లో 276 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇదిలా ఉంటే.. అబుదాబిలో మంగళవారం జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలి పోయిన కాన్వే.. వేలం తర్వాత తన తొలి మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీ సాధించడం విశేషం.
చదవండి: IPL 2026 Auction: స్టీవ్ స్మిత్, కాన్వేలకు షాక్.. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే


