2025 ఏడాదిలో క్రీడల్లో ఒక శకం ముగిసింది. మైదానంలో తమ అసాధారణ ప్రతిభతో అభిమానులను మంత్రముగ్ధులను చేసిన ఎందరో సూపర్ స్టార్‌లు ఈ ఏడాది (2025) తమ కెరీర్‌ను ముగించారు. ఈ క్రమంలో ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజాలపై ఓ లుక్కేద్దాం.

రోహిత్ శర్మ..
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఏడాది మేలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్.. ఇంగ్లండ్ టూర్‌కు ముందు రెడ్‌బాల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. తన టెస్టు కెరీర్‌లో 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 40.58 సగటుతో 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
విరాట్ కోహ్లి..
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లి కూడా రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులకే కింగ్ కూడా టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు అమితమైన ఇష్టమని, భారత్ తరపున ఆడినంత కాలం ఈ ఫార్మాట్‌లో కొనసాగుతానని కోహ్లి ఎన్నోసార్లు చెప్పారు.
కానీ సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కోహ్లి తప్పుకోవడంతో భారత టెస్ట్ క్రికెట్‌లో 'రో-కో' శకం ముగిసింది. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 ఆర్ధ శతకాలు ఉన్నాయి. విరాట్ కూడా ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.

ఛతేశ్వర్ పుజారా
భారత టెస్ట్ క్రికెట్ లో 'నయా వాల్' గా పేరుగాంచిన ఛతేశ్వర్ పుజారా.. ఈ ఏడాది ఆగస్టులో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకొన్నాడు. గత కొన్నేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం పుజారా అద్భుతంగా రాణిస్తుండేవాడు. కానీ యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన కెరీర్‌ను ఛతేశ్వర్ ముగించాడు. పుజారా తన కెరీర్‌లో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయ.

స్టీవ్ స్మిత్, మాక్సీ గుడ్‌బై
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. మాక్సీ ఈ ఏడాది జూన్‌లో తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

హెన్రీచ్ క్లాసెన్
సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు సడన్‌గా వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. బోర్డుతో విభేదాల కారణంగా క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్లాసెన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 3245 పరుగులు చేశాడు.

నికోలస్ పూరన్:
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకొని అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల మోజులో పడి పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

జాన్ సీనా..
స్టార్ రెజ్లర్, WWE దిగ్గజం జాన్ సీనా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికారు. జాన్ సీనా తన చివరి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి.. ప్రపంచ రెజ్లింగ్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. జాన్ సీనా తన కెరీర్‌లో మొత్తం 17 వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ లెజెండరీ రెజ్లర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే 'పీస్‌మేకర్' (Peacemaker) వంటి సిరీస్‌లతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జాన్‌సీనా.

సెర్గియో బుస్కెట్స్ (ఫుట్‌బాల్)
స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ మాంత్రికుడు సెర్గియో బుస్కెట్స్ మేజర్ లీగ్ సాకర్ సీజన్ ముగిసిన తర్వాత ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మయామి ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున లియోనెల్ మెస్సీతో కలిసి సెర్గియో ఆడాడు.

పర్దీప్ నర్వాల్ (కబడ్డీ)
కబడ్డీ లెజెండ్, 'డూ ఆర్ డై' స్పెషలిస్ట్ పర్దీప్ నర్వాల్ 2025 ప్రో కబడ్డీ లీగ్ (PKL) వేలంలో అమ్ముడుపోకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. అయితే కోచ్‌గా పనిచేసేందుకు తన సిద్దంగా ఉన్నట్లు నర్వాల్ తెలిపాడు.


