భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కొన్నేళ్లుగా వడ్డీ రేట్ల భారంతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాలకు 2025 సంవత్సరంలో ఊరటకల్పించింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ ఏకంగా 125 బేసిస్ పాయింట్ల (1.25%) మేర రెపోరేటును తగ్గించింది.
ఫిబ్రవరిలో 6.5%కి చేరిన రేటు వరుస కోతలతో ఇప్పుడు 5.25 శాతం వద్ద స్థిరపడింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు గణనీయంగా తగ్గాయి. కొత్తగా అప్పులు తీసుకునే వారికి కూడా ఇది శుభవార్తే. 2025-26 నాటికి 7.3% జీడీపీ వృద్ధిని సాధించడమే లక్ష్యంగా గవర్నర్ సంజయ్ మల్హోత్రా బృందం ఈమేరకు పనిచేస్తోంది.
| మానిటరీ పాలసీ సమావేశం | రెపోరేటులో మార్పు(బేసిస్ పాయింట్లు) | ప్రస్తుత రెపోరేటు |
|---|---|---|
| ఫిబ్రవరి 2025 | 25 | 6.25% |
| ఏప్రిల్ 2025 | 25 | 6.00% |
| జూన్ 2025 | 50 | 5.50% |
| డిసెంబర్ 2025 | 25 | 5.25% |
ఆర్‌బీఐ దీర్ఘకాలిక లక్ష్యాలు
ఆర్‌బీఐ కేవలం వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025 అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి పడిపోయింది.
ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని 2% వద్ద స్థిరీకరించాలని భావిస్తోంది. తక్కువ ధరల వల్ల సామాన్యుడి వస్తు కొనుగోలు శక్తి పెరుగుతుంది.
దేశీయ డిమాండ్‌ను పెంచడం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్‌బీఐ 7.3%కి పెంచింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు పుంజుకుంటాయని అంచనా.
బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడానికి ఆర్‌బీఐ దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలును ప్రకటించింది.
సవాళ్లు - వ్యూహాత్మక నిర్ణయాలు
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును తాకినప్పటికీ ఆర్‌బీఐ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. బలమైన విదేశీ మారక నిల్వలు ఉండటంతో రూపాయి పతనంపై ఆందోళన చెందకుండా దేశీయ వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాల వల్ల భారత ఎగుమతులపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ అది భారత ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. దీన్ని ఎదుర్కోవడానికి దేశీయంగా ఉత్పాదకతను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించారు.
తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ద్రవ్యోల్బణం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా అడుగులు వేయిస్తోంది.
ఇదీ చదవండి: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..


