డిజిటల్ స్వీకరణ, నియంత్రణ మార్పులు, విదేశీ పెట్టుబడులు భారత బీమా రంగాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అయాన్ (Aon) విడుదల చేసిన ‘గ్లోబల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఇన్‌సైట్స్ రిపోర్ట్’ ప్రకారం.. కొన్ని విభాగాల్లో కొనుగోలుదారులకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, సైబర్, ప్రాపర్టీ బీమాల్లో ఒత్తిడి పెరుగుతోంది.
చాలా బీమా విభాగాలు ఇప్పటికీ “సాఫ్ట్ మార్కెట్”లో ఉన్నాయి. అంటే పోటీ ధరలు విస్తృత కవరేజ్ లభిస్తున్నాయి. అయితే, సైబర్ బీమాలో క్లెయిమ్స్ సంఖ్య, వ్యయం గణనీయంగా పెరగడంతో బీమా సంస్థలు కఠిన అండరైటింగ్ విధానాలు, అధిక డిడక్టిబుల్స్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్ కారణంగా సైబర్ బీమా అత్యధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగంగా మారింది.
ప్రాపర్టీ బీమాలో 2025లో అమలులోకి వచ్చిన క్వాసీ-టారిఫ్ ధర విధానాలు డబుల్ డిజిట్ ప్రీమియం పెరుగుదలకు దారితీశాయి. దీంతో ఖర్చు తగ్గించుకునే అవకాశాలు కొనుగోలుదారులకు తగ్గాయి. మరిన్ని రీ-ఇన్సూరెన్స్ సంస్థలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ఈ విభాగంలో అస్థిరత కొనసాగనుంది.
ఇదిలా ఉండగా, భారత బీమా మార్కెట్లో సామర్థ్యం పెరుగుతోంది. కొత్త బీమా సంస్థలు, విదేశీ రీ-ఇన్సూరర్లు ప్రవేశించడం, అలాగే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల పోటీ, ఆవిష్కరణలు పెరిగాయి.
ఈ పరిణామాలపై స్పందించిన అయాన్ ఇండియా చీఫ్ బ్రోకింగ్ ఆఫీసర్ శాంతనూ సక్సేనా.. “2025లో భారత బీమా మార్కెట్ వేగంగా ఎదుగుతున్న, అవకాశాలతో నిండిన వాతావరణాన్ని చూపిస్తోంది. ఇది కొనుగోలుదారులకు మరింత ఎంపికలను అందిస్తోంది” అని పేర్కొన్నారు.


