భవిష్యత్ ఆర్థిక భద్రత, దీర్ఘకాలిక పొదుపు, రిటైర్మెంట్ అనంతరం ఆదాయ రక్షణ వంటి కీలక అంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో జీవిత బీమా రంగం స్థిరంగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లు, త్వరిత పాలసీ జారీ వ్యవస్థలతో బీమా కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతోంది. అయినప్పటికీ జీవిత బీమాపై ప్రజల్లో ఇంకా కొన్ని అపోహలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఆర్జన మొదలుపెట్టిన యువతలో బీమా అవసరం లేదన్న భావన ఎక్కువగా కనిపిస్తోంది. కానీ చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉండడమే కాక, దీర్ఘకాల కవరేజీ లభిస్తుంది. ఆర్థిక స్వాతంత్య్రం, ముందస్తు రిటైర్మెంట్ లక్ష్యంగా పెట్టుకున్న యువత కోసం ప్రస్తుతం నెలకు రూ.1,000 నుంచి ప్రారంభమయ్యే సేవింగ్స్ ఆధారిత ప్రణాళికలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సంక్లిష్టంగా అనిపించిన బీమా ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ అయింది. మొబైల్ యాప్‌ల నుంచి పాలసీ కొనుగోలు, డాక్యుమెంటేషన్, అదే రోజున పాలసీ జారీ వరకు అన్నీ సరళతరం కావడంతో బీమా ఇప్పుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా మారింది.
దేశీయ బీమా రంగంలోని కంపెనీలు ప్రస్తుతం 98–99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేటు సాధిస్తున్నాయి. అవసరమైన పత్రాలు సమర్పించగానే మరుసటి రోజే సెటిల్మెంట్ చేసే సంస్థలు కూడా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.పొగ తాగే అలవాటు లేని 30 ఏళ్ల వ్యక్తి రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రోజుకు రూ.30 కన్నా తక్కువే ప్రీమియం అవుతుంది. కాఫీ ధర కంటే కూడా తక్కువ. దీంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబ ఆదాయ రక్షణకు, గృహ రుణాలు వంటి ఆర్థిక భారం తీర్చేందుకు టర్మ్ ప్లాన్ కీలకంగా ఉపయోగపడుతుంది.
కొత్త తరహా లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు పాలసీదారుల జీవితకాలంలోనే అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఉదాహరణకు క్రిటికల్ ఇల్‌నెస్ కవర్లు చికిత్స ఖర్చులను భర్తీ చేసి కుటుంబ పొదుపులను రక్షిస్తాయి. స్మార్ట్ ఆర్థిక ప్రణాళికలో లైఫ్ ఇన్సూరెన్స్ కీలకం . ప్రస్తుత పరిస్థితుల్లో జీవిత బీమా కేవలం భద్రతకే పరిమితం కాకుండా, భవిష్యత్ అవసరాలను తీర్చే ఆర్థిక సాధనంగా మారిందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు


